జనసేన అధినేత వపన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్న జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యకర్తలు తిరుపతి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయాలని కోరుతున్నారు. ఈ మధ్య జరిగిన తిరుపతి సభలో పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని అక్కడి కేడర్ ఉత్సాహంగా తెలిపింది. ఇక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. దురదృష్టం కొద్దీ రెండు చోట్ల ఓడిపోయారు. భీమవరం నుంచి… గాజువాక నుంచి పోటీ చేశారు.
రెండు చోట్ల ఓడిపోవడంతో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. జనసేన తరపున రాజోలు నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఆయన కూడా వైఎస్ఆర్‌సీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో జనసేన పార్టీకి ఎమ్మెల్యే లేకుండా అయిపోయినట్లయింది. స్వయంగా అధినేత రెండు చోట్ల ఓడిపోవడంతో పవన్ ఫ్యాన్స్ డీలా పడ్డారు. ఇతర పార్టీలు కూడా ముందు పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలవాలని సవాల్ చేస్తూ వస్తున్నాయి.
ఈ సారి పవన్ కల్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే గతంలో ఓడిపోయిన స్థానాల కంటే… సేఫ్ ప్లేస్ ఎంచుకోవాలని భావిస్తున్నారు. తిరుపతిలో గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి విజయం సాధించారు. పవన్ కల్యాణ్‌కు చిరంజీవికి అక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. ఈ సారి తిరుపతిలో పోటీ చేస్తే గెలుపు ఖాయమన్న నమ్మకంతో జనసేన వర్గాలు ఉన్నాయి. తమ ఆకాంక్షను శ్రేణులు పవన్ కల్యణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.