అమరావతి, ఆంధ్రప్రభ : రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళా వలస కూలీపై చోటు చేసుకున్న సామూహిక అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని, పొట్టకూటి కోసం వలస వచ్చిన కుటుంబానికి ఎదురైన ఈ దిగ్భ్రాంతికర ఘటన రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిని తెలియచేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో గత పది రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకొంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా బాధిత కుటు-ంబాలపైనే నిందలు వేసి తప్పించుకోవాలని ప్రభుత్వం చూడటం గర్హనీయమన్నారు. తుమ్మపూడి ఘటనలో పోలీసు అధికారుల తీరు ఇలాగే ఉందని మండిపడ్డారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రకటనలు కూడా ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తున్నాయన్నారు. ‘ఇలాంటి సంఘటనలకు తల్లులే కారణం.. వాళ్ళు సరిగా లేకపోవడమే కారణమ’ని చెప్పడం విచిత్రంగా ఉందని నాదెండ్ల వ్యాఖ్యానించారు.
రేపల్లె సామూహిక అత్యాచార ఘటనలో ఏ తల్లి తప్పు ఉందని ప్రశ్నించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారానికి ఏ తల్లి తప్పిదమో బాధ్యత కలిగిన రాష్ట్ర హోం శాఖ మంత్రి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ అత్యాచార ఘటనపై స్పందించిన తీరు చూశాక రాష్ట్ర హోం శాఖ మంత్రి అవగాహనారాహిత్యం వెల్లడైందన్నారు. హోం శాఖను, పోలీసులను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఫలితమే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడమని తేల్చి చెప్పారు. చిత్తశుద్ధి లేకుండా చట్టాలు చేసి.. ప్రచారం చేసుకోవడం వల్ల ఏ ఒక్క ఆడ బిడ్డకు భరోసా లభించదన్నారు. తాడేపల్లి ఇంటి నుంచి కదలని ముఖ్యమంత్రి.. ఒకసారి బయటకు వచ్చి బాధిత కుటుంబాలను పలకరిస్తే ఆడపిల్లల తల్లితండ్రులలో ఉన్న భయాందోళనలు తెలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కీచక పర్వాన్ని ఖండించే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల వారిని కట్టడి చేసి అరెస్టులు చేయడం మాని మహిళల రక్షణపై చిత్తశుద్ధిగా పని చేయాలని సూచించారు. రేపల్లె ఘటనలో బాధితురాలు నాలుగు నెలల గర్భిణి అని తెలిసిందని, ఆమె ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..