Friday, November 22, 2024

మునిసిప‌ల్ ఎన్నిక‌ల షెడ్యూల్ పై జ‌న‌సేన అభ్యంత‌రం..రీ షెడ్యూల్ కి డిమాండ్

అమరావతి: మున్సిపల్‌ నామినేషన్ ప్రక్రియ మొదటి నుంచి ప్రారంభిస్తే అందరికీ న్యాయం జరుగుతుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్‌ నామినేషన్ ప్రక్రియ ప్రజాస్వామ్య బద్దంగా లేదన్నారు. నోటిఫికేషన్‌పై ఎస్‌ఈసీ మరోసారి ఆలోచించాలని నాదెండ్ల మనోహర్‌ డిమాండ్ చేశారు. కరోనా పరిస్థితుల్లో ఈసీ తీసుకునే నిర్ణయాన్ని అన్ని రాజకీయ పక్షాలు సమర్థించాయని తెలిపారు. ఆనాడు వైసీపీ నేతలు చాలా దౌర్జన్యాలకు పాల్పడ్డారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరించి వైసీపీ నేతలు నామినేషన్ వేశారని చెప్పారు. అవన్నీ వదిలేసి ఇప్పుడు మళ్లీ ఆగిన చోటినుంచి ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ఇదే విధానం కొనసాగితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని తాము ఆశించడం లేదన్నారు. రాజకీయ పార్టీల గుర్తుల ఆధారంగా జరుగుతున్న ఎన్నికలను అందరికీ ఆమోదయోగ్యంగా నిర్వహించాలని కోరారు. సామాన్యులకు ధైర్యం నింపేలా, అభ్యర్థులకు అండగా ఉండేలా ఈ ఎన్నికలు ఉండాలని చెప్పారు. జనసేన అభ్యర్థులకు అండగా నిలుస్తామన్నారు. ఓటర్ స్లిప్పులపై పథకాల పేర్లు రాసి నిలిపివేస్తామని వలంటీర్లు హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ తమ స్వలాభం కోసం వలంటీర్లను రాజకీయాలకు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎస్ఈసీ మరోసారి మున్సిపల్‌ నామినేషన్ ప్రక్రియపై పునరాలోచించాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement