జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. కాగా దారిలో బాపట్ల జిల్లాలో కాసేపు ఆగారు. కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు బయలుదేరిన పవన్ కళ్యాణ్‌కు గుంటూరు శివారు ఏటుకూరు వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వేలాది మంది జనసైనికులు పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిపించారు.
ప్రకాశం జిల్లాలో పర్యటనకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ కు దారిలో ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక.. గజమాలతో పవన్ ను సత్కరించారు. తనకు ఘనస్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పవన్ అన్నారు. ఈ సందర్భంగా చాలామంది లోకల్ ఇష్యూస్ మీద పవన్ కళ్యాణ్ కి వినతిపత్రాలు అందజేశారు.
మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం, యువత, ఆడపడుచుల అభ్యున్నతి కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. తన జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అంకితమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా పర్చూరులో కౌలు రైతు భరోసా యాత్రలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష రూపాయిల చొప్పున సాయం అందించారు.