Tuesday, November 26, 2024

భయపడే వ్యక్తిని కాదు…తొక్కతీసి నార తీస్తాః వైసీపీకి పవన్ వార్నింగ్

పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. రాజకీయాలు తనకు సరదా కాదని, బాధ్యత అని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. అనంతరం బాలాజీపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సంరద్భంగా జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు పని కట్టుకుని తనను దూషిస్తున్నారని… తన సహనాన్ని తేలికగా తీసుకోవద్దని, తాట తీసి నారతీస్తానని పవన్ హెచ్చరించారు. యాక్షన్, కెమెరా, కట్ అని వెళ్లే మనిషిని కాదని… పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదన్నారు. ఎన్నో ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చానని చెప్పారు.

ప్రజలు కడుతున్న పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తున్నాయన్న ప్రభుత్వం.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ప్రజల కోసమే తిట్లు తింటున్నానని తెలిపారు. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష అని అన్నారు. శ్రమదానం తనకు సరదా కాదని..,కులాల పేరిట కొందరు  రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.  

గుంతలు లేని రోడ్డు రాష్ట్రంలో ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కులాలను అడ్డంపెట్టుకుని బిచ్చం వేస్తామంటే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. కమ్మ సామాజికవర్గాన్ని వర్గ శత్రువులుగా ప్రకటించి మొత్తం రాష్ట్రాన్నే అతలాకుతలం చేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనపై రెడ్డి సామాజికవర్గంలో కూడా బాధ ఉందన్నారు. తేలుకు పెత్తనమిస్తే అందరినీ కుళ్లబొడిచిందన్నట్టుగా.. అన్ని కులాలను వైసీపీ ప్రభుత్వం కుళ్లబొడుస్తోందని చెప్పారు. వైసీపీ పాలనలో ఎవరికీ మాట్లాడే అధికారమే లేకుండా చేశారని… నోరు తెరిస్తే కొడతారని, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడతారని మండిపడ్డారు. కడప జిల్లాలో నలుగురు బీజేపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు హత్య చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికులపై జరుగుతున్న దాడులకు అంతే లేదని పవన్ పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఊరుకునే వ్యక్తిని తాను కాదని పవన్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండిః క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌–జగనన్న స్వచ్ఛ సంకల్పం.. ప్రారంభించిన సీఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement