ఎన్నికల ప్రచార మైదానంలోకి దిగడానికి జనసేన అధినేత పవన్ రెడీ అయ్యారు. పిఠాపురం నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఈ ప్రచార యాత్రకు ‘వారాహి విజయభేరి’ అని నామకరణం చేశారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకూ పవన్ పిఠాపురంలో పర్యటిస్తారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సాయంత్రం చేబ్రోలు రామాలయం సెంటర్‌లో ప్రారంభం కానుంది.
పిఠాపురం నుంచి ప్రారంభంకానున్న ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు జనసేన చీఫ్. పవన్ నిర్వహించబోతున్న ఎన్నికల ప్రచారం పిఠాపురంలో మూడు రోజుల పాటు సాగనుంది. ప్రచారంలో భాగంగా ఈరోజు పవన్ కల్యాణ్.. నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశమవుతారు. అనంతరం శ్రీపాద వల్లభుడి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు ఉప్పాడ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న పార్టీ చేరికలు పర్యవేక్షించి, నియోజకవర్గంలోని మేధావులతో సమావేశం కానున్నారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి. గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు.