Wednesday, November 20, 2024

Jana senani – పవన్ కల్యాణ్ తో వైసిపి ఎమ్మెల్యే వర ప్రసాద్ భేటి – తిరుపతి నుంచి పోటీకి ఆసక్తి

వైసీపీలో మార్పులు చేర్పుల్లో భాగంగా మాజీ ఐఏఎస్, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కు టికెట్ నిరాకరించారు సీఎం జగన్. ఈ క్రమంలో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే వరప్రసాద్ జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. దాదాపు అరగంటపాటు పవన్ తో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. జనసేనలో చేరి రాబోయే ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనే ఆలోచన తనకు ఉన్నట్లు వరప్రసాద్ తన మనోగతాన్ని పవన్ కు వెల్లడించినట్లు సమాచారం.

ఎమ్మెల్సీగా ఉన్న మేరుగు మురళీకి గూడూరు అసెంబ్లీ స్థానం కేటాయించారు సీఎం జగన్. దీంతో వరప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు. స్థానిక నేతలతోనూ ఆయనకు పడని పరిస్థితి ఉంది. అధికార పార్టీకి దూరంగా ఉంటున్నారు. జనసేన నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్లు పవన్ కు వెల్లడించారు వరప్రసాద్. గూడూరులో టీడీపీ నుంచి బలమైన అభ్యర్థిగా సునీల్ కుమార్ ఉన్నారు. గతంలో 2014లో తిరుపతి పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచారు వరప్రసాద్. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంటుకు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వరప్రసాద్ పవన్ కల్యాణ్ ను కోరినట్లు సమాచారం.

కాగా, దీనిపై వరప్రసాద్ కు పవన్ కల్యాణ్ ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. పార్టీలో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెబుతానని పవన్ కల్యాణ్ ఆయనతో అన్నట్లు సమాచారం. తిరుపతి జనసేన నేతలతో చర్చించిన తర్వాత పవన్ కల్యాణ్ దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ పవన్ కల్యాణ్ ను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన చాలామంది నేతలు జనసేనతో టచ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement