సమస్యకు శాస్త్రీయ పరిష్కారం వెతకండి
నిపుణులకు పవన కల్యాణ్ పిలుపు
ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
మారిటైం బోర్డు, కేంద్ర ఖగోళశాస్త్ర మంత్రిత్వశాఖ
అధికారులతో కలసి తీర ప్రాంతంలో పర్యటన
పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవెర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యచరణకు దిగారు. ఉప్పాడ తీరంతో సముద్రపు కోతకు గురయిన ప్రాంతాన్ని నేడు సందర్శించారు. అక్కడ మారీ టైమ్ బోర్డు, కేంద్ర ఖగోళశాస్త్ర మంత్రిత్వ శాఖ(ఎర్త్ సైన్స్ మినిస్ట్రి) అధికారులు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు, నివారణోపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ తీరంలోనే సముద్రం ఎందుకు ముందుకు వస్తోంది? దీనికి గల కారణాలు, తీరాన్ని కోతకు గురి కాకుండా చేయాల్సిన మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, దీనిపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించి పనులు మొదలు పెడదామని చెప్పారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.
ఉప్పాడ గ్రామ తీర ప్రాంతంలో మొత్తం 84 ఎకరాల విస్తీర్ణంతో భూమి సముద్రంలో కలిసిపోయిందని జిల్లా సర్వేయర్ లక్ష్మీ నారాయణ తెలిపారు. 60 ఎకరాలు కోతకు గురయ్యాక సర్వే ప్రారంభించినట్టు, సర్వే ప్రారంభించిన తర్వాత మరో 20 ఎకరాలు సముద్రంలోకి వెళ్లిపోయిన విషయాన్ని వివరించారు. మొత్తం యు.కొత్తపల్లి మండల పరిధిలోని 8 తీర ప్రాంత గ్రామాల్లో 1360 ఎకరాలు కోతకు గురైన విషయాన్ని తెలుసుకుని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చెన్నై నుంచి ఉప్పాడ తీర ప్రాంత కోతపై పరిశోధన జరిపేందుకు వచ్చిన కేంద్ర ఖగోళశాస్త్ర మంత్రిత్వశాఖ అధికారులు, మారిటైం బోర్డు అధికారులను సముద్రపు కోతపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వర్మ, జనసేన సమన్వయకర్త మరెడ్డి శ్రీనివాస్, బీజేపీ ఇంఛార్జ్ కృష్ణంరాజు, జనసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పూల వర్షంతో స్వాగతించిన ఉప్పాడ ప్రజలు
ఉప్పాడ తీర ప్రాంత కోత సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులతో కలసి అధ్యయనానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ను ఉప్పాడ గ్రామ ప్రజలు, తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. మత్స్యకార మహిళలు పూల వర్షం కురిపించి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.