Saturday, June 29, 2024

Jana Senani – పేదోళ్ళ ఫైలుపైనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలి సంతకం –

ఉద్యాన శాఖ నిధులతో ఉపాధి హమీ పనులు
ఇక గిరిజన పంచాయతీ భవనాల నిర్మాణం
అభిమాని పెన్నుతో ఫస్ట్ సిగ్నేచర్
అన్న నాగబాబు సహా మంత్రుల అభినందనలు

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి)
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉపముఖ్యమంత్రి హోదాలోని పవన్‌ కళ్యాణ్ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉపాధి హామీ పనులను ఉద్యానవన శాఖ చేపట్టే పనులను అనుసంధానం, నిధుల మంజూరు పైల్ పై తొలి సంతకం చేశారు. దీంతో పల్లెల్లోని ఉపాధి హామీ కూలీల పని రోజులు పెరుగుతాయి. కరువు జిల్లాల్లో ఉపాధి హామీ పనులు ఇక జోరందుకుంటాయి. ఇక గిరిజనం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గిరిజన తండాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు ఫైల్ పై సంతకం చేశారు.

- Advertisement -

ఇచ్చిన మాటకు కట్టుబడి …

ఇక 2019లో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జాతీయ ‘ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. మహిళా దినోత్సవం రోజున రైతులకు జనసేన ఇస్తున్న మాట ఇది. ఆడపడుచుల విన్నపాలు అందిన తరువాత వచ్చిన ఆలోచనే ఇది’ అని 2019లో మహిళా దినోత్సవ వేడుకల్లో జ‌న‌సేనాని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ నిల‌బెట్టుకున్నారు.అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్‌కు అభినందనలు తెలిపారు. మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌, ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, తెదేపా నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అభినందనలు తెలిపారు.

అభిమాని పెన్నుతో తొలి సంతకం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం మంగళగిరి నుంచి అమరావతిలోని సచివాలయానికి బయల్దేరారు. ఆయనకు అమరావతి రైతులు అడుగడునా టన్నుల కొద్దీ బంతిపూలతో స్వాగతం పలికారు. ఇంతలో పవన్ కళ్యాణ్‌ కాన్వాయ్ వెళుతుండగా.. ఓ అభిమాని ఓ పెన్నును గిఫ్ట్‌గా అందించారు. ఈ పెన్‌ను జాగ్రత్తగా తీసకుని జేబులో పెట్టుకున్నారు. ఆ అభిమాని ఇచ్చిన పెన్నును డిప్యూటీ సీఎం మర్చిపోలేదు.. బుధవారం తన క్యాంపు కార్యాలయానికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఫైల్స్‌పై సంతకాలు చేయడంతో జన సైనికులు ఆనంద పరవశులయ్యారు. గతవారం పవన్ కళ్యాణ్‌కు వదిన కొణిదెల సురేఖ ఓ పెన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.. ఆ పెన్ విలువ లక్షకుపైగా ఉంది.. అయినా సరే ఆ పెన్‌తో కాకుండా అభిమాని ఇచ్చిన పెన్‌తో సంతకం చేయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement