Sunday, November 24, 2024

Jana Senani – భీమవరం బరిలో పవన్ రీఎంట్రీ … ఓడిన చోటే గెలవాలనే ధ్యేయం..

భీమవరం ప్రతినిధి (ప్రభన్యూస్): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక లలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లకు ఈసారి అవకాశం లేకుండా పక్క వ్యూహంతో జనసేనని ఉన్నారనేది ఆ పార్టీ నాయకుల ప్రణాళికలు చూస్తే తెలుస్తుంది. గతంలోలా రెండు చోట్ల పోటీ చేయకుండా కేవలం భీమవరం నుంచే పకడ్బందీ వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేశారనేది జనసేన వర్గాలను అందుతున్న సమాచారం. భీమవరం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటికి సిద్ధకావడంతో జనసేన వర్గంలో జోష్ కనిపిస్తోంది. పవన్ పోటీపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

జ‌న‌సైనికుల త‌హ‌త‌హ‌..

పవన్ కళ్యాణ్ సొంత జిల్లా పశ్చిమగోదావరిలో జనసేన, టీడీపీ కూటమి బలంగా కనిపిస్తోంది. ఈ కూటమి బలాన్ని జనసేన బలోపేతానికి, జనసేనాని గెలుపుకి ఉపయోగించుకోవాలని జనసైనికులు తహతహలాడుతున్నారు.పవన్ కళ్యాణ్ తిరిగి భీమవరం నుంచి పోటీ కి సిద్ధమైనట్లు వస్తున్న సమాచారంతో తెలుగు రాష్ట్రాల్లో భీమవరం పై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. చర్చలతో పాటు జనసేన సేనాని గెలుపు పై జోరుగా పందాలు కాస్తున్నారు.

త్రిముఖ పోరులో..

గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల త్రిముఖ పోరులో జనసేనాని పై వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ సుమారు నాలుగు శాతం ఓట్లతో విజయం సాధించారు. నేడు జనసేన, టీడీపీ పార్టీలు పొత్తులో భాగంగా ఒకటవ్వడంతో గతంలో టీడీపీకి పడిన ఓట్లు జనసేనకు బదిలీ అవుతాయనే ధీమాతో జనసేన నాయకులు ఉన్నారు. ఈసారి ఎలాగైనా భీమవరం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే సంకల్పంతో జనసేన ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇంకా ఎన్నికలకు సుమారు రెండు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే భీమవరం ఎన్నికలలో అధికార వైసీపీ నుంచి తిరిగి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని జన సైనికులు చెబుతున్నారు.

- Advertisement -

బలంగా భీమవరం సెంటిమెంట్..

భీమవరంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేది ఇక్కడ నానుడి. ఇందుకు గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, రాష్ట్రంలో అధికారం చేపట్టిన పార్టీలనే ఉదాహరణగా చెబుతూ ఉంటారు. ఇక్కడ నుంచి గెలుపొందిన అభ్యర్థులు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. ఒకప్పుడు క్షత్రియలకు కంచుకోటగా ఉన్న భీమవరం నియోజవర్గం నేడు కాపు సామాజి వర్గానికి కంచుకోటగా మారింది.

జనసేన జోరు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం జనసేన నాయకులు భీమవరం నియోజకవర్గంలో జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తూనే మరోవైపు తమ కూటమిలో భాగస్వామ్యటీడీపీ తో కలిసి ఇంటింటికి కార్యక్రమాలను జనంలోకి జనసేన ను తీసుకు వెళ్తున్నారు. సుమారు నెలరోజులుగా జనంలోకి జనసేన కార్యక్రమాన్ని భీమవరం నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) మార్గ నిర్దేశంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్, ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో జనసేన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. జనసేన నాయకులు ముద్రించిన కరపత్రాలను ఇంటింటికీ పంచుతూ జనసేన, టీడీపీ కూటమికి ఈసారి మద్దతు తెలపాలని కోరుతున్నారు. పనిలో పనిగా వైసిపి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతున్నారు.

భీమవరానికి 14న పవన్ రాక

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ఈనెల 14న భీమవరం నుంచే ప్రారంభించనున్నారు. మూడు రోజులపాటు ఈ పర్యటన సాగనుంది. 14న తొలి రోజు భీమవరంలో పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించే సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడతారు. అనంతరం పాలకొల్లులో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. పశ్చిమ సమావేశాల అనంతరం అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో జరిగే సమావేశాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. పవన్ భీమవరం పర్యటనలో తెలుగుదేశం ముఖ్య నాయకులతో కూడా ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం. టీడీపీ జనసేన శ్రేణుల ఐక్యంగా ముందుకు సాగటం, భవిష్యత్తు లక్ష్యాలపై ఈ భేటీలో ప్రస్తావించనున్నారు. భీమవరం నుంచే తన పోటీ ఖరారు చేస్తున్నట్లు పవన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement