విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేతపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు..విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటే నిరసన తెలిపి ఆ కూడలిని తెరవాలని కోరిన తమ నేత నాదెండ్ల మనోహర్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అంటూ ధ్వజమెత్తారు. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు..
ప్రజల సమస్యలు తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసు అధికారులు అందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏంటని పవన్ నిలదీశారు. ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తుందని, ఇందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని తెలిపారు. నాదెండ్ల మనోహర్ ను, ఇతర నేతలను పోలీసులు తక్షణమే విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. ‘ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే నేను విశాఖపట్నం బయల్దేరి వస్తాను… ప్రజల తరఫున పోరాడతాను’ అంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
ప్రభుత్వ, పోలీసుల తీరుపై నాగబాబు విమర్శలు
జనసేన నేతలను, కార్యకర్తల అరెస్ట్ లో ప్రభుత్వం, పోలీసుల తీరుపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలపడం తప్పా? ప్రజల తరపున నిలబడటం తప్పా? సమస్యల పరిష్కారానికి ప్రజా గొంతుకను వినిపించడం తప్పా? మేము దాడులు చేయలేదు, దహనాలు చేయలేదు… రాజ్యాంగం మాకు కల్పించిన హక్కుల పరిధిలో పోరాడటం తప్పా? అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు తమ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమయ్యారని… అయితే, వారిపట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని చెప్పారు.