మచిలీపట్నం – అవినీతి, దౌర్జన్యంతో ప్రజల కష్టాన్ని, శ్రమను వైకాపా నేతలు దోచుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మచిలీపట్నం సువర్ణ కల్యాణ మండపంలో రెండు గంటల పాటు పవన్ మౌన దీక్షకు కూర్చున్నారు. ముందుగా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, బ్రిటిషర్ల లక్షణాలు పుణికి పుచ్చుకున్న పాలకులు రాష్ట్రంలో ఉన్నారు. ప్రజలను వర్గాలుగా విభజించి పాలించే ధోరణిలో వెళ్తున్నారు. ఓటు, సత్యాగ్రహం విలువను గాంధీజీ తెలియచెప్పారు. ఆ ఆయుధాలు ఉపయోగించి నయా బ్రిటిష్ పాలకులను రాష్ట్రం నుంచి పంపించడం మన ధర్మంగా రాష్ట్ర ప్రజలు భావించాలని జనసేనాని పిలుపునిచ్చారు.
దేశానికి జాతీయ జెండా ఇచ్చిన నేల మీద గాంధీ జయంతి చేసుకోవడం నా అదృష్టం అని ఆయన వ్యాఖ్యనించారు. జాతి ప్రేరణ కోసం పెట్టినది మచిలీపట్నం లోని నేషనల్ కాలేజీ.. ఎందరో మహానుభావులు నేషనల్ కాలేజీ విద్యార్ధులు.. నేషనల్ కాలేజీలో ఒకసారైనా అడుగు పెట్టాలి.. ఇప్పుడు ఆ కాలేజీ పరిస్ధితి సరిగ్గాలేదు అని ఆయన ఎద్దేవా చేశారు. రాముడి పాటని ఈశ్వర్ అల్లా చేర్చి మన దేశ ఔన్నత్యాన్ని పెంచిన గాంధీకి మనం రుణపడి ఉంటాం అని జనసేనాని అన్నారు.
పది లక్షల మందిని జాతీయ గీతానికి నిలబెట్టిన నేల మచిలీపట్నం అని పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా చంపేశారు అని అన్నారు. ఎన్నికలు చాలా కష్టమైనవి.. బ్రిటిష్ వారికి ఉన్న సంయమనం కూడా లేదు మన రాష్ట్ర నాయకులకు.. ఇప్పుడు సమకాలీన రాజకీయాలు సంయమనంతో ఉంటాయని ఆశిస్తున్నా.. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి.. కలుషితమైన రాజకీయాల నుంచీ జనసేన అనే కమలం వస్తుంది అని ఆయన పేర్కొన్నారు.