ఎపిలో అధికార టిడిపి కూటమి అధికారంలో వచ్చేందుకు విశేష కృషి చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తన మంత్రి వర్గంలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు….ఉప ముఖ్య మంత్రి హోదాతో పాటు జనసేనానికి కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితోపాటు.. గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్‌కు కేటాయించారు చంద్రబాబు. పవన్ కు ఆరు శాఖలను అప్పగించి తన అభిమానాన్ని చాటుకున్నారు టిడిపి అధినేత..
అలాగే జనసేన మంత్రులకు సైతం చంద్రబాబు ప్రాధాన్యత శాఖలనే ఇచ్చారు… సామర్లకోట నుంచి గెలుపొందిన కందుల దుర్గేష్ కే సినిమాటోగ్రఫితో పాటు పర్యాటక శాఖను ఇవ్వగా, తెనాలి నుంచి విజయం సాధించిన నాదేండ్ల మనోహర్ కు ఆహార , పౌర సరఫరాతో పాటు వినియోగదారుల వ్యవహారాల శాఖను కేటాయించారు..
పవన్ కు, మంత్రులకు చందబాబు విషెస్…
ఏపీ మంత్రులకు నేడు శాఖలు కేటాయించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా నూతన మంత్రుల పనితీరు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రజా పాలనలో కొత్త అధ్యాయం మొదలవుతోందని పేర్కొన్నారు.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు. ఏపీ క్యాబినెట్ లోని మంత్రులు అందరికీ శాఖలు కేటాయించడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మేం అందరం కలిసి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తామని, ప్రజా పాలనా శకానికి నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా పోర్ట్ ఫోలియోలు అందుకున్న మీరు మన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ఈ పవిత్రమైన బాధ్యతలతో కూడిన ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న మీకందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.