మచిలీపట్నం – అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు జగన్ హామీలు ఇచ్చారని విమర్శించారు జనసేనాని పవన్ కల్యాణ్ . . పాదయాత్ర చేస్తున్న సమయంలో నోటికి ఏదొస్తే అది హామీగా ఇచ్చేశారని దుయ్యబట్టారు. అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మచిలీపట్నంలో నిర్వహించిన జనవాణిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనవాణిలో పవన్ ను విద్యుత్ మీటర్ల రీడర్లు కలిశారు. తమకు పని భారాన్ని విపరీతంగా పెంచి పొమ్మనకుండా పొగ పెడుతున్నారని వారు వాపోయారు. మరోవైపు పవన్ ను కలిసిన వికలాంగులు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కోట్లు ఖర్చు చేస్తున్నా, వారికి మేలు చేయడంలో విలమవుతున్నారని చెప్పారు. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉంటే… ఒక్కరికే పెన్షన్ అంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు.
పెడనలో వారాహి విజయ యాత్రలో దాడులు…అప్రమత్తంగా ఉండాలన్న పవన్
రేపు పెడన నియోజకవర్గంలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ నిర్వహించనున్నామని, కానీ రేపటి సభలో దాడులు చేయడానికి కొంతమంది వైసీపీ కిరాయి గూండాలు ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఉందని వెల్లడించారు. దయచేసిన జనసైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
“జగన్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు… మాపై రేపు పెడన సభలో కత్తులు, రాళ్లతో దాడులు చేయించాలని చూస్తున్నావ్… ఏదైనా జరిగితే బాధ్యత నీదే. రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ, అధికారులకు, కలెక్టర్లకు చెబుతున్నాను… శాంతిభద్రతలు కాపాడాల్సిన మీరు వైసీపీ నాయకులకు వత్తాసు పలకడం సరికాదు. గూండాలు వస్తే కచ్చితంగా ఎదుర్కొంటాం. అమలాపురం నుంచి అడుగడుగునా వారాహి విజయ యాత్రను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రేపు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత. రేపు పెడనలో సభలో వైసీపీ కిరాయి రౌడీలు దాడులకు ప్రయత్నిస్తే… జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు ప్రతిదాడులకు దిగొద్దు… వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించండి” అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.