జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకూ పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఈ పర్యటన కోసం జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు భీమవరంలో వివిధ సమావేశాల్లో పవన్ పాల్గొననున్నారు. తదుపరి అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు ఉంటాయి. ఈ పర్యటనలలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నేతలతో పవన్‌కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ క్రమంలోని టీడీపీ నేతలతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరుపార్టీల నాయకులు శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల ఫలాల లక్ష్యంగా భేటీలు జరగనున్నాయి.
పవన్‌కళ్యాణ్ పర్యటనలు మూడు దశలుగా నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. తొలి దశలో ముఖ్య నాయకులతో సమావేశాలు ఉండనున్నాయి. రెండో సారి పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు కార్యకర్తలు, వీర మహిళల సమావేశాలలో పాల్గొననున్నారు. మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు, ఎన్నికల ప్రచారం చేపట్టే నాటికి పవన్ మూడు సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్లే విధంగా పర్యటనల షెడ్యూల్ సిద్ధమవుతోంది. ఉభయగోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఇతర ప్రాంతాలకు సంబంధించిన పర్యటనలను ఖరారు చేసేందుకు జనసేన ప్రచార కమిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.