Tuesday, November 19, 2024

Jana Sena – అడవారిని బెదిరించే, చెల్లిని బయటకు గెంటివేసే వారు అర్జునుడా …జగన్ పై పవన్ సెటైర్లు

మంగళగిరి – మంచితనానికి మారుపేరు, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం లాంటి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పాలన సాగుతోందని జనసేనాని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈ సాయంత్రం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ “జగన్ చాలా బాధపడిపోతున్నారు. ఆయనను అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు, ఆయనొక అర్జునుడులాగా, మేమందరం కౌరవుల్లాగా, ప్రజలే ఆయన ఆయుధాలు అని, ప్రజలే ఆయనకు శ్రీకృష్ణుడు అని మాట్లాడుతోంటే చాలా అసహ్యంగా ఉంటోంది. అర్జునుడు ఆడవాళ్లను రక్షించాడే తప్ప, తూలనాడలేదు. జగన్ తనను తాను అర్జునుడితో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉంది. సొంత చెల్లెలు షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే, అలా తిట్టేవారిని ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను. అతను అర్జునుడుతో పోల్చుకుంటున్నాడు. తోడబుట్టిన చెల్లెలికి గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత బాబాయ్ ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు… వాళ్లను వెనకేసుకొచ్చే వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని వివేకా కూతురు డాక్టర్ సునీత చెబుతుంటే, ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. ఎవరు అర్జునుడో, ఎవరు కౌరవులో నేను మహాభారతం స్థాయికి వెళ్లి మాట్లాడదలుచుకోలేదు.

ఇది కలియుగం. అందులో ఒకటో పాదమో, రెండో పాదమో తెలియదు కానీ… మనం ఎవ్వరం కూడా శ్రీకృష్ణుడితో, అర్జునుడితో, కౌరవులతో పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ… నేను పవన్ కల్యాణ్, మాది జనసేన. ఎవరు మంచి వాళ్లు, ఎవరు అండగా నిలుస్తారు, ఎవరు దోపిడీదారులో ప్రజలకు బాగా తెలుసు. స్వగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏ రోజూ కూడా ఆయనను తగ్గించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వలేని వాడు, మనింట్లో ఆడపడుచులకు గౌరవం ఇస్తాడని నేను అనుకోవడంలేదు. వైసీపీ ఉన్న చోటే ఇంత దిగజారుడు రాజకీయం ఉంటుంది. దేశంలో ఇంత దిగజారుడు రాజకీయం ఎక్కడా చూడలేదు. నన్ను వ్యక్తిగతంగా ఎన్నిసార్లు తిట్టినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎందుకు బాధ్యతగా ఉన్నానంటే, రాబోయే తరాలకు ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి” అంటూ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఇక, పవర్ స్టార్, పవర్ స్టార్ అంటారు… పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు? అని వ్యాఖ్యానించారు. పవర్ స్టార్ అనే పదం తనకు ఎబ్బెట్టుగా ఉంటుందని, తనను ప్రజల మనిషి అనుకోవడమే ఇష్టమని పేర్కొన్నారు. అందుకే సినిమాల్లో కూడా ఆ పదం వాడనని వెల్లడించారు.

సీట్ల పంపకం అంశాన్ని ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో గెలిచేది, ప్రభుత్వాన్ని స్థాపించేది జనసేన-టీడీపీ కూటమి అని స్పష్టం చేశారు. అయితే అందుకు ఎంతో పోరాటం చేయాల్సి ఉందని అన్నారు. జగన్ మోసాలు, మాయలు అన్నింటినీ అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. పొత్తు అన్న తర్వాత సీట్ల సర్దుబాటు ఎప్పుడూ కష్టంగానే ఉంటుందని తెలిపారు. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ వంటి పార్టీలతో కూడా సీట్లు సర్దుబాటు కష్టంగానే ఉంటుందని, అయితే ఏ అడుగు వేసినా జనసేన పాదముద్ర చాలా బలంగా ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే, పోటీ చేసే ప్రతి సీటు గెలిచే సీటు అవ్వాలని తాము కోరుకుంటున్నామని, ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది ముఖ్యం కాదని తమ మనసులో మాటను వెల్లడించారు. 

ఎంతని కాదు, ఎన్ని అని కాదు… గెలిచే ప్రతి సీటు జనసేన సీటు కావాలి… తక్కువలో తక్కువగా 98 శాతం స్ట్రయికింగ్ రేటు ఉండాలి అని పిలుపునిచ్చారు. దీనికి అందరి అభిమానం కావాలి, అందరి ఆశీస్సులు కావాలి అని విజ్ఞప్తి చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement