న్యూ ఢిల్లీ – జనసేన పార్టీకి గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం.. గ్లాస్ గుర్తును జనసేన పార్టీకే కేటాయించింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి ‘గ్లాస్’ను కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
గ్లాస్ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు.. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్ ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన సంగతి తెలిసిందే., ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు నాడు పోటీలో నిలిచారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రజలకు సేవ చేయడానికి జనసేన అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకం అన్నారు పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, యావన్మంది సిబ్బందికి పేరుపేరునా నా తరఫున, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..
మరోవైపు.. జనసేన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంత కాలం కింద రద్దు చేసిన విషయం విదితమే కాగా.. ఇక పార్టీకి గుర్తు ఉండబోదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం పార్టీకి అదే గుర్తును కేటాయించడంతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు.. జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి