జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , జనసేన పార్టీ శాసనసభ్యులు లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ గిడ్డి సత్యనారాయణ, వర ప్రసాద్ తదితరులు వెంటరాగా రిటర్నింగ్ అధికారి ఎమ్. విజయరాజుకి నామినేషన్ పత్రాలు అందజేశారు.
అనంతరం శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా . హరిప్రసాద్ మాట్లాడుతూ “పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడ వరకు రావడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. ఇప్పటి వరకు పాత్రికేయుడిగా ఆ సమస్యల పరిష్కారానికి పరోక్షంగా కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం లభించింది. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, వారికి మేలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.
పవన్ కు రుణపడి ఉంటా…
ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటాను. పవన్ ప్రపోజల్ ను అంగీకరించి, నాకు ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు. అసభ్యతకు తావు లేకుండా సంస్కారవంతమైన చర్చ జరిగేలా కౌన్సిల్ లో నా వంతు కృషి చేస్తాన”ని అన్నారు.