Friday, November 22, 2024

సిద్దేశ్వరం అలుగు కోసం జలదీక్ష.. సీమ నీటిహక్కు కోసం ఉద్యమం ఉధృతం

నంద్యాల: రాయలసీమ కరువు పరిష్కారానికి, ,శ్రీశైలం ప్రాజెక్టు పూడిక నివారణకు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో సిద్దేశ్వరం అలుగు, రాయలసీమ సాగునీటి చట్టబద్ద హక్కుల సాధన కార్యాచరణ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. కృష్ణానదిపై సిద్దేశ్వరం వద్ద అలుగుకు వేలాది మంది గత ఆరేళ్ల క్రితం తరలివచ్చి ప్రజా శంఖుస్థాపన చేసారని ఆయన గుర్తు చేసారు. తక్కువ నిధులతో రాయలసీమ లోని ఎనిమది జిల్లాలు, తెలంగాణలోని రెండు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి పరిష్కారానికి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ఎంతో అవసరమని గుర్తుచేసారు.

పాలకుల నిర్లక్ష్యం కారణంగానే సిద్దేశ్వరం అలుగు నిర్మాణం జరగడం లేదని దశరథరామిరెడ్డి ఆరోపించారు. రాయలసీమకు చట్టబద్ద నీటిహక్కులు సాధించుకునేందుకు మే 31 వ తేదీన ఆరవ ప్రజా శంఖుస్థాపనను పురస్కరించుకుని సిద్దేశ్వరం వద్ద వేలాది మందితో జలదీక్ష నిర్వహిస్తున్నామనీ, ఈ జలదీక్షకు రైతులు వందలాది ట్రాక్టర్లతో రైతులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణా, తుంగభద్ర నదులలో నీరు ఉన్నా ప్రతియేటా రాయలసీమకు కరువు తప్పడంలేదని ప్రభుత్వాలు ప్రకటనలకే పరిమితమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ లోని ఎనిమిది జిల్లాలలో సిద్దేశ్వరం అలుగు ఉద్యమం స్ఫూర్తితో చట్టబద్ద నీటిహక్కుల సాధనకు ప్రజా ఉద్యమం చేస్తున్నామనీ, రైతులు ఈ ఉద్యమంలో వేలాదిగా పాల్గొని మే 31 న సిద్దేశ్వరం వద్ద జరిగే జలదీక్షకు తరలిరావాలని కోరారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలోని అన్ని రైతుసంఘాలు మరియు ప్రజాసంఘాల సమన్వయంతో ఉద్యమం చేస్తున్నట్లు చెప్పారు. పట్టణాలలోని ప్రజలు కూడా త్రాగునీటి పరిష్కారానికి రాయలసీమ సాగునీటి ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో గోస్పాడు మండలం నుండి బెక్కం రామసుబ్బారెడ్డి, బాలీశ్వరరెడ్డి, వుశేని, నందిరైతు సమాఖ్య అధ్యక్షులు ఉమామహేశ్వరరెడ్డి, బనగానపల్లె మండలం యాగంటి బసవేశ్వర రైతు సంఘం నాయకులు ఎం సి.కొండారెడ్డి, శిరివెళ్ళ మండలం జయరామిరెడి, ఆళ్ళగడ్డ మండల రైతు నాయకులు జాఫర్ రెడ్డి, వెలుగోడు మండలం నుండి భాస్కర్ రెడ్డి, పాణ్యం మండలం నుండి ఏర్వ రామిరెడ్డి, నంద్యాల మండలం నుండి భూమా రామకృష్ణారెడ్డి, కోవెలకుంట్ల మండల రైతు నాయకులు జయరామిరెడ్డి, దొర్నిపాడు మండల రైతు నాయకులు బ్రహ్మయ్య, రుద్రవరం మండల రైతు నాయకులు వెంకటస్వామి యాదవ్, బండి ఆత్మకూరు మండల రైతు నాయకులు పిట్టం ప్రతాపరెడ్డి , శివరామిరెడ్డి, .శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement