విరమణ వేడుక… మరింత వైభవంగా…
ఐదు రోజుల వేడుక నేటి నుండి ఆరంభం…
అట్టహాసంగా ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు…
అగ్ని ప్రతిష్టాపనతో కార్యక్రమం ప్రారంభం..
వర్ణమాల పూలతో సర్వాంగ సుందరంగా ఆలయం…
విశేషంగా తరలివస్తున్న భవానీలు…
జై భవాని.. జై జై భవాని… నామస్మరణ…
అమ్మ కరుణాకటాక్షాల కోసం గిరి ప్రదక్షణ….
అమ్మ శరణు ఘోషతో దద్దరిల్లుతున్న ఇంద్రకీలాద్రి…
కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న అధికారులు…
ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న భవానీలు….
(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) – జై భవాని జై జై భవాని నామస్మరణతో ఇంద్రకీలాద్రి దద్దరిల్లుతోంది. కనకదుర్గమ్మ కరుణాకటాక్షాల కోసం అమ్మ శరణు ఘోషను స్తుతిస్తూ పరమ పవిత్రంగా దీక్షబూనిన భవానీలు అమ్మ దర్శనం కోసం తరలివస్తున్నారు. భవాని దీక్ష దారుణలో అత్యంత ముఖ్యమైన చివరి ఘట్టం దీక్షా విరమణ వేడుక మరింత వైభవంగా అట్టహాసంగా ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైంది. శనివారం నుండి ప్రారంభమవుతున్న ఈ దీక్ష విరమణ మహోత్సవంలో భాగంగా ముందుగా ఆలయ అర్చకులు వైదిక కమిటీ సభ్యులు ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం కనకదుర్గ నగర్ లోని హోమగుండం వద్ద అగ్ని ప్రతిష్టతో వేడుక లాంఛనంగా ప్రారంభమైంది. భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఆలయం సర్వాంగ సుందరంగా దేదీప్యమానమైన విద్యుత్ కాంతుల నడుమ, వివిధ రకాల వర్ణమాల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. దీక్షా విరమణ కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక తమిళనాడు ఒరిస్సా నుండి కూడా భవానీలు సుమారు రెండు లక్షలకు పైగా రావచ్చన్న అంచనా తో అధికారులు అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
గిరి ప్రదక్షణతో ప్రారంభం…
భవాని దీక్షల సందర్భంగా భవానీలు పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకుంటున్నారు. దీక్షా విరమణ సందర్భంగా వస్తున్న భవానిలో ముందుగా కృష్ణానది పరివాహక గాట్లలో పుణ్యస్నాన్ని ఆచరించి గిరి ప్రదక్షణను ప్రారంభిస్తున్నారు. ఇంద్రకీలాద్రి చుట్టూ సుమారు 8 కిలోమీటర్ల మేర సాగుతున్న ఈ గిరి ప్రదక్షణలో క్షణక్షణం అమ్మవారి శరణు ఘోషతోపాటు, వివిధ పాటలను పాడుతూ ఆనందోత్సాహాల మధ్య ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రదక్షిణానంతరం వినాయక గుడి వద్ద ప్రారంభమవుతున్న క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకుని అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించి, అమ్మవారి దివ్య స్వరూపాన్ని కనులారా చూస్తూ తన్మయత్వం చెందుతున్నారు. శివాలయంలో పాము దర్శనానంతరం మహా మండపం దిగున ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద దీక్ష విరమణ చేసిన అనంతరం వెంట తీసుకువచ్చినా నేతి కొబ్బరికాయలను హోమగుండంలో సమర్పిస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్న భవానీలు, అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనా లడ్డూను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అలాగే అమ్మవారికి తలనేలాలు సమర్పించే భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక కేశఖండనశాల వద్ద తమ తల నిలాలను సమర్పించుకుంటున్నారు. భక్తులు సేదతీరి ఎందుకు ఏర్పాటుచేసిన కంపార్ట్మెంట్ల వద్ద కొద్దిసేపు సేద తీరి తిరిగి పైనమవుతున్నారు.
నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ మల్లింపు..
అత్యంత వైభవంగా ఇంద్రకీలాద్రిపై జరిగే భవాని దీక్షల విరమణ మహోత్సవానికి సంబంధించి నగరంలో పోలీసులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లక్షల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా విజయవాడ నగరంలోకి వచ్చే వాహనాలను పలు ప్రాంతాల ద్వారా ఇతర మార్గాలకు మళ్ళిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాదు, చెన్నై , విశాఖపట్నం వైపు వచ్చేవి వెళ్లే వాహనాలను పలుమార్గాల ద్వారా దారి మళ్లించి ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. అలాగే ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా బారికెట్లను ఏర్పాటు చేసి భవానీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.