ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను మండిపడ్డారు. ఆదివారం జగ్గయ్యపేట పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాని చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీలలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రాష్ట్రంలో ఎంతో మంది మహిళలకు ఆర్థికంగా చేయూత అందుతుంటే వాటిని ప్రతిపక్ష నేత తప్పుబట్టే ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు. మహిళల హక్కులను, సంక్షేమాన్ని, అభివృద్ధిని కోర్టుల ద్వారా అడ్డుకోవడం చంద్రబాబుకి సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, ఇంగ్లీషు మీడియం ఇలా అన్నింటినీ అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. పేదలందరికీ ఇళ్లు అందిస్తుంటే కోర్టుల్లో స్టేలు తెచ్చి బాబు అండ్ కో రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టించి మహిళల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: వన్ ప్లస్ 9 ఆర్ టీ.. తక్కువ ధరలో ప్రీమియం ఫోన్