జగన్ మోహన్ రెడ్డి పని, ఆయన పార్టీ పని అయిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లాకు వచ్చిన చంద్రబాబు పీలేరు సబ్ జైలులో ఉన్న టీడీపీ నేతలను పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలను జైలులో పెట్టించాడని, పండగపూట వారిని కలిసి పరామర్శించేందుకు వచ్చానన్నారు. టీడీపీ శ్రేణులపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతున్నారని, నీచాతి నీచంగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. పోలీసుల తీరు ఉగ్రవాదులను తలపిస్తుందన్నారు.
ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతలు కోడికత్తి డ్రామాలు ఆడొద్దని ఎద్దేవా చేశారు. ఏపీలో మైనార్టీలకు మనుగడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు చించివేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ? గాడిదలు కాస్తున్నారా ? బ్యానర్లు ఎందుకు చింపుతున్నారని అడిగిన పాపానికి కార్యకర్తల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. రొంపిచర్లలో అతి దారుణంగా 8 మంది మైనారిటీలపై కేసులు పెట్టారన్నారు. చెప్పిన మాట వినకపోతే తుపాకీ చూపించి చంపేస్తామని పోలీసులు బెదిరించారన్నారు. దీనికంటే టెర్రరిస్టు చర్య మరోకటి ఉంటుందా ? ఇష్టానుసారంగా కొట్టి మెజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టారన్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ పాటించాలి. కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారా ? పోలీసులు ఖబడ్దార్.. జాగ్రత్త, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని చంద్రబాబు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.