Friday, November 15, 2024

Jagan’s Voice – మళ్లీ అధికారం మనదే – ఇలాంటి దాడులు ఆపలేవు

దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయి
దైర్యంగా అడుగులు వేద్దాం
బస్సు యాత్రలో సీఎం జగన్
ఊరూరా జన కడలి పరవళ్లు
నువ్వే సీఎం.. నువ్వే కావాలి
మేమంతా సిద్ధం.. మార్మోగిన జన నినాదం
భారీ భ‌ద్ర‌త న‌డుము కొన‌సాగుతున్న యాత్ర‌
దాడిపై ఫోక‌స్ పెట్టిన పోలీసులు
ప్ర‌త్యేక బృందాల‌తో ఎంక్వైరీ

(ఆంధ్రప్రభ స్మార్ట్, గన్నవరం ప్రతినిధి) అడుగుడుగునా జనం బ్రహ్మరథం పడుతూ.. నీవే సీఎం జగనన్న .. నీవే కావాలి అనే నినాదాల న‌డుమ ఏపీ సీఎం జ‌గ‌న్ యాత్ర 15వ రోజు కొన‌సాగింది. ప్రజావ్యతిరేకులు రాళ్ల దాడితో గాయపడగా విశ్రాంతి అవసరమని డాక్ట‌ర్లు సూచించినా వెనుకాడక మేమంతా సిద్ధంగా ఉన్నామన్న జనం కోసం జగన్ ముందడుగు వేశారు. కృష్ఱా జిల్లా కేసరపల్లిలో బస అనంతరం సోమవారం యాత్ర ప్రారంభం అయ్యింది. ఊరూర జనం కదలి వచ్చారు. కేసరపల్లి నుంచి బయలుదేరిన జగన్ యాత్ర గన్నవరం చేరుకోగా.. గ‌న్న‌వ‌రం అంతా జనం సంద్రంగా మారింది. ఇక్కడ నుంచి జొన్నపాడు వరకూ జనం జగన్ వెంటే కదంతొక్కారు. మేమంతా సిద్ధంగా ఉన్నామని నినదించారు.

జ‌నాన్ని చూసి చ‌లించిన జ‌గ‌న్‌..

ఈ జనం పరవవళ్లను, ప్రవాహాన్ని చూసి జగన్ చలించిపోయారు. ప్రజల ఆశీర్వాదం వల్లే అదృష్టవశాత్తూ ఈ దాడి నుంచి తాను తప్పించుకున్నాని అన్నారు.. తనను కలసిన నేతలతో మాట్లాడుతూ.. ఇలాంటి దాడులు తనను ఆపలేవన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం తనకు ఉన్నాయని చెప్పారు. ధైర్యంగా అడుగులు ముందుకేద్దాం.. ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని జగన్ వారితో అన్నారు. బస్సుయాత్రలో భాగంగా రోజూ ఉదయం 9 గంటల నుంచి సంబంధిత నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను క‌లుస్తున్నారు. కాగా, సోమవారం ఈ కార్యక్రమానికి కృష్ణా , ఎన్టీఆర్ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్రం నలుమూలనుంచి పలువురు నాయకులు తరలివచ్చారు.

- Advertisement -

నేతల పలకరింతలు.. పరామర్శలు

శాసనమండలి చైర్మన్ కె. మోషేన్ రాజు, మంత్రులు జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎంపీ ఆయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌, ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్ధి సింహాద్రి చంద్రశేఖర్‌, పెడన నియోజకవర్గ అభ్యర్థి ఉప్పాల రాము, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్‌, గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్ధి దేవినేని అవినాష్‌, మైలవరం అభ్యర్ధి సర్నాల తిరుపతిరావు సీఎం జగన్ మోహన్ రెడ్డిని పరామర్శించారు.

వైసీపీలో చేరికలు..

కృష్ణా జిల్లా కేసరపల్లిలో బస త‌ర్వాత‌ సోమవారం ఉదయం మేమంతా సిద్ధం యాత్రకు జగన్ మోహన్ రెడ్డి బయలుదేరుతున్న తరుణంలో ఎన్టీఆర్ జిల్లా, నంద్యాల జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వైసీపీలో చేరారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్, హజ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అహ్మద్‌ హుస్సేన్, టీడీపీ అధికార ప్రతినిధి ముస్తాఫా మొమిన్, కర్నూలు జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షుడు ముఫ్తీ నూర్‌ మహమ్మద్, మహమ్మద్‌ ఇలియాస్‌కు పార్టీ కండువ కప్పి వైసీపీలోకి జ‌గ‌న్‌ ఆహ్వానించారు. ఇక.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మార్కెటింగ్‌ కమిటీ మాజీ చైర్మన్, టీడీపీ కీలకనేత చిరుమామిళ్ల శ్రీనివాసరావు (అలియాస్‌ బుజ్జి), నందిగామ పట్టణ మాజీ అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ వడ్డెలి శ్రీనివాసరావు, నందిగామ మున్సిపల్‌ టీడీపీ కీలక నేత వై. రామారావు, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గోడపాటి బాబూరావు, ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు షేక్‌ కరీముల్లా, సీనియర్‌ నేతలు షేక్‌ హసీనా, కొమ్ము విజయరాజు వైసీపీలో చేరారు.

భారీ భద్రత చర్యలు

విజయవాడలో సీఎం జగన్‌పై దాడి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టంగా, పకడ్బందీగా పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వివిధ జిల్లాల నుంచి డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించారు. సీఎం వెళ్లే మార్గాలను మూడు సెక్టారులుగా విభజించారు. ఒకొక్క సెక్టార్‌కు ఒక డీఎస్పీ , ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు బందోబస్తులో ఉన్నారు.

దర్యాప్తు ముమ్మరం

సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ రోడ్ నిర్వహిస్తుండగా శనివారం రాత్రి సింగనగర్ డాబా కొట్లరోడ్డులో రాయి తగిలి జ‌గ‌న్ నుదుటిపై గాయమైంది. ఈ ప్రాంతంలో అనుమానితుల కదలికలపై స్థానికుల నుంచి స్టేట్ మెంట్లను పోలీసులు రికార్డు చేశారు. వారం రోజులుగా పదే పదే స్థానికంగా తిరిగిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సెల్ టవర్స్ నుంచి దాడి తర్వాత ఎక్కువ సార్లు మాట్లాడిన వారి ఫోన్ కాల్స్ పై టెక్నికల్ టీమ్ ఫోకస్ చేసింది. వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచే దాడి జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.

అవారా బ్యాచ్‌ల‌పై ఆరా..

రౌడీ షీటర్లతో పాటు, గంజాయి, చెడు వ్యసనాలు తిరిగి ఆవారా బ్యాచ్ లను పోలీసు బృందాలు విచారణ చేప‌ట్టాయి. 24 సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించి అనుమానితులను గుర్తించే పనిలో క్లూస్ టీమ్ ఉంది . బస్సుకి 20 నుంచి 30. అడుగుల దూరం నుంచే దాడి జరిగినట్టు గుర్తించిన పోలీసులు.. ఈ తరహా దాడులకు పాల్పడే పాత నేరస్తులపై ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం పశ్చిమ డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో 20 మందితో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఇందులో ఆరు బృందాలు పనిచేస్తున్నాయి. లా అండ్ ఆర్డర్, సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు సభ్యులుగా ఉన్న ఈ బృందాలు ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement