Monday, November 18, 2024

Jagan’s Siddham – భగభగ మండే ఎండలు… జగన్ పై తరగని అభిమానం

బత్తలపల్లి, ( ప్రభన్యూస్): వైయస్ జగన్పై ఉన్న అభిమానంతో ప్రచండ బానుడి ఉగ్రరూపాన్ని లెక్క చేయక తండోపతండాలుగా తరలివచ్చిన జన సమూహం గంటల తరబడి మండు ఎండలలో అభిమాన నేత రాక కోసం ఎదురు చూశారు. సోమవారం మండల కేంద్రమైన బత్తలపల్లి నాలుగు రోడ్ల కూడలిలో వేలాదిగా తరలివచ్చిన జన సమూహం మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షో కొనసాగింది.”మేమంతా సిద్ధం “బస్సు యాత్రలో భాగంగా 5వ రోజు మండల పరిధిలోని సంజీవపురం వద్ద విడిది కేంద్రం నుండి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఉదయం 10:20 కి ప్రారంభమైన బస్సు యాత్ర నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మండల కేంద్రమైన బత్తలపల్లికి జగన్ బస్సుయాత్ర రావడానికి ఒకటిన్నర గంట సమయం పట్టింది. దారి పొడవునా రాఘవంపల్లి,లింగారెడ్డిపల్లి బస్సు స్టేజీల వద్ద తరలివచ్చిన అభిమానుల కోసం చిరునవ్వుల మధ్య అభివాదం చేస్తూ బస్సు యాత్ర కొనసాగింది.

మండల కేంద్రానికి చేరుకోగానే పూల వర్షం కురిపిస్తూ సార్వత్రిక ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కూటమి పార్టీలపై చేస్తున్న యుద్ధానికి మేమంతా సిద్ధం అంటూ కేరింతలు కొడుతూ, జై జగన్ నినాదాలతో స్వాగతం పలికారు. ధర్మవరం నియోజకవర్గం వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సిపి శ్రేణుల మధ్య కూడలిలో రోడ్ షో కొనసాగింది. బస్సుపై జగన్ ప్రక్కన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ, కురబ కార్పొరేషన్ చైర్మన్ కోటీ సూర్యప్రకాష్ బాబు ఉన్నారు.భారీగా తరలి వచ్చిన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించకపోయిన దాదాపు 20 నిమిషాల పాటు కూడలిలోనే బస్సు ఆపి చుట్టూ కలయ తిరుగుతూ అందరినీ పలకరిస్తున్నట్లుగా చిరునవ్వులతో అభివాదం చేస్తూ రోడ్ షో కొనసాగింది.

కురబ కార్పొరేషన్ చైర్మన్ కోటి సూర్య ప్రకాష్ బాబు, వైఎస్ఆర్సిపి అభిమాని గంటాపురానికి చెందిన పాల్యం అప్ప స్వామి వైయస్ జగన్కు గొర్రె పిల్లను అందజేస్తూ,కంబడిని అందజేశారు.కూడలిలో ఎంపీపీ భగ్గిరి త్రివేణి, మాజీ మండల కన్వీనర్ భగ్గిరి బయపరెడ్డి దంపతులు క్రేన్ సహాయంతో భారీ గజమాలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఆహ్వానించారు. అటు తర్వాత రోడ్ షో లోనే మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ మాదిరెడ్డి జయరామిరెడ్డి భారీ గజమాలతో స్వాగతం పలికారు. అంతకు మునుపు ఉదయం విడిది కేంద్రంలో వైసీపీ ముఖ్య నాయకులు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement