అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: పేదల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుం టూ అభివృద్ధి, సంక్షేమం వైపు శరవేగంగా దూసుకు పోతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరోసరికొత్త నిర్ణయం తీసుకోబోతు న్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఇంటికి ఒక్క పింఛన్ విధానం మాత్రమే అమల్లో ఉంది. దానిని మార్పుచేస్తూ ప్రతి ఇంటికీ రెండో పింఛన్ అందిం చేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగానే అర్హుల జాబితాను కూడా రూపొందిస్తున్నట్లు అధికా ర వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఎన్నికల లోపు ఈ ప్రక్రియను పూర్తిచేసి రాష్ట్ర వ్యాప్తంగా పండుటాకు లకు మరింత భరోసాను కల్పించే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తం గా ఆయా సచివాలయాల పరిధిలో సిబ్బంది ఇప్పటికే సర్వే కూడా ప్రారంభించినట్లు చెబుతున్నా రు. అర్హుల జాబితాను గుర్తించి వచ్చే ఏడాది ఆరంభం నుండి రెండో పింఛన్ ప్రక్రియను ప్రారం భించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 64 లక్షల మంది నిరుపేదలకు ప్రతి నెలా రూ.2750 పింఛన్‌ను ప్రభుత్వం అందిస్తుంది. వచ్చే జనవరి నుండి ఆ పింఛన్ రూ.3 వేలకు పెరగనుంది. గతంలో సీఎం జగన్ రూ.2 వేలు ఉన్న పింఛన్‌ను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతోపాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం కూడా పింఛన్ పెంపు ఫైలు మీదే చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా దశలవారీగా ప్రతి ఏడాది రూ.250 పెంచుతూ వ స్తున్నారు. వచ్చే జనవరి నాటికి ఆ పింఛన్ రూ.3 వేలకు పెరగనుంది. ఈ నేపథ్యంలోనే పింఛన్‌ను పెంచి ఇవ్వడంతోపాటు అర్హులైన వారిని గుర్తించి ప్రతి ఇంటికీ రెండో పింఛన్‌ను కూడా ఇవ్వాలని సీఎం జగన్ యోచనకు వచ్చారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కొత్త ఏడాది ఆరంభంలోనే పింఛన్ పెరుగదలతోపాటు రెండో పింఛన్ ప్రక్రియ కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పండుటాకులకు… మరింత భరోసా
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళ తదితర వర్గాలకు ఇచ్చే పింఛన్లు కాకుండా వృద్ధులకు సుమారు 64 లక్షల మందికిపైగా పింఛన్లు ప్రతి నెలా అందిస్తుంది. అందుకోసం రూ. వేల కోట్లు వెచ్చిస్తుంది. అయితే వృద్ధ దంపతులకు మరింత ఆసరా కల్పించాలన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్ దంపతులిద్దరికీ పింఛన్లు అందించేలా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటివరకూ ప్రతి ఇంట్లో ఒక్కరికే పింఛన్ అందించేవారు. అయితే ప్రతి ఏటా పెరుగుతున్న ధరలు వృద్ధులకు అనారోగ్య సమస్యలు మందుల ఖర్చు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో వారికి మరింత అండగా నిలవాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ రెండో పింఛన్‌ను అందించాలని యోచిస్తుంది. ఆదిశగా ఇప్పటికే గ్రామ సచివాలయాల పరిధిలో సిబ్బంది సర్వేను కూడా ప్రారంభించారు. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో ఏడు ల క్షల నుండి 10 లక్షల మంది వరకూ వృద్ధుల పింఛన్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 64 లక్షల మంది వృద్ధులకు పింఛన్ అందిస్తున్నారు. 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఆయా ఇళ్లల్లో మరో 10 లక్షల మంది వరకూ ఉండే అవకాశాలు ఉన్నాయి. వచ్చే జనవరి నుండి కొత్తగా పెరిగే పింఛన్‌తోపాటు ప్రస్తుతం వస్తున్న పింఛన్ల సంఖ్యకు మరో 10 లక్షల వరకూ సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్నికల వేళ సీఎం జగన్ సరికొత్త తాయిలం
2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ పేద ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అవే అంశాలను స్పష్టంగా పొందుపర్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నవరత్నాలతోపాటు పేదలకు అవసరమైన మరిన్ని పథకాలను ప్రవేశపెడుతూ వస్తున్నారు. ఓవైపు లోటు బడ్జెట్‌తో రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నా పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సీఎం జగన్ గత నాలుగు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలను క్రమం తప్పకుండా అమలు చేస్తూ వస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పేదల ముందుకు మరిన్ని వరాలను ప్రకటించే దిశగా సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి ఇంటికీ రెండో పింఛన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వాటితోపాటు మరికొన్ని తాయిలాలను కూడా సీఎం జగన్ ప్రకటించబోతున్నారు.