పోలింగ్ అనంతరం లండన్ వెళతానన్న జగన్
అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్
అనుమతి ఇవ్వవద్దన్న సీబీఐ లాయర్లు
గతంలో అనుమతించారన్న జగన్ న్యాయవాదులు
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. దీంతో సీబీఐ లాయర్లు అభ్యంతరం చెప్పారు. సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని ధర్మాసనాన్ని కోరారు. గతంలో కూడా కోర్టు అనుమతి ఇచ్చిందని ఈ సందర్భంగా జగన్ తరపు లాయర్లు గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 14కు వాయిదా వేసింది.
కాగా ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే లండన్ వెళ్లేందుకు సీఎం జగన్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆయనపై ఉన్న కేసుల నేపథ్యంలో కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీంతో నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను లండన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.