Saturday, November 23, 2024

AP | ఐదో జాబితాకు జగన్ ఫైనల్ టచ్ – విడుదలకు కౌంట్ డౌన్

అమరావతి, ఆంధ్రప్రభ : అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐదో జాబితాకు తుదిమెరుగులు దిద్దుతోంది.. ఇప్పటి వరకు 60 మంది ఎమ్మెల్యేలు.. 10 మంది సిట్టింగ్‌ ఎంపీలతో నాలుగు జాబితాలను విడుదల చేసిన అధిష్టానం ఐదో జాబితాలో మరో ఐదు ఎంపీ సీట్లు, ఐదుకు పైగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చే యోచనలో ఉంది.. గత కొద్ది రోజులుగా జాబితాకు ముమ్మర కసరత్తు జరుపుతున్నారు. ఇందులో భాగంగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపు రావటంతో ఆఘమేఘాలపై తరలి వస్తున్నారు.

పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్నందున జాబితాను బుధ లేదా గురువారాల్లో ప్రకటించేందుకు ముఖ్యనేతలు రంగం సిద్ధం చేస్తున్నారు.. సీఎంఓ నుంచి పిలుపు వస్తున్న నేపథ్యంలో సీటును పదిలం చేసుకునేందుకు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు సిట్టింగ్‌లు పాట్లు పడుతున్నారు.

- Advertisement -

మంగళవారం కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కృష్ణాజిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, తాడేపల్లిగూడెం అసెంబ్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రేపల్లె ఇన్‌చార్జి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తదితరులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం రాజకీయ ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డిలను కలుసుకుని చర్చలు జరుపుతున్నారు.

రేపల్లె ఇన్‌చార్జిగా ఇటీవలే అధిష్టానం ఈవూరి గణేశ్‌ను నియమించిందని తన సొంత నియోజకవర్గం బాధ్యతలు తనకే అప్పగించాలని మాజీ మంత్రి మోపిదేవి రమణారావు పార్టీ నేతలతో చర్చించినట్లు తెలియ వచ్చింది.. కర్నూలు, బనగానపల్లె, శ్రీశైలం ఎమ్మెల్యేలు కూడా తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.. కాగా గురజాల నియోజకవర్గం ఇన్‌చార్జిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని తప్పిస్తారనే ప్రచారం జరగటంతో ఆయన కూడా పార్టీ అధినేతలను కలుసుకున్నారు.

ఇదే నియోజకవర్గ సీటును మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆశిస్తున్నారు. అయితే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కల్పించే విషయమై అధిష్టానం పరిశీలన జరుపుతున్నట్లు వినికిడి. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. ఎన్నికల్లో విజయావకాశాలను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుని వైసీపీ అధిష్టానం అభ్యర్థుల మార్పులో ఆచితూచి ఆడుగులు వేస్తోంది.. వాస్తవానికి ఐదో జాబితా ఇప్పటికే సిద్ధమైనప్పటికీ అందులో కొన్ని నియోజక వర్గాలకు సంబంధించి ఎంపిక కొలిక్కి రాకపోవటంతో ప్రస్తుతం అత్యవసరమనుకున్న స్థానాల్లో మాత్రమే మార్పులు చేస్తున్నారు.

ఇప్పటికే ఇన్‌చార్జిలను ప్రకటించిన స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్‌, వాసుపల్లి గణేశ్‌లు కూడా తమకు మరోవిడత అవకాశం ఇస్తే విజయం సాధిస్తామని ధీమాను అధిష్టానం ఎదుట వ్యక్తపరచినట్లు తెలిసింది. ఇక లోక్‌సభ స్థానాలకు సంబంధించి వైసీపీ ధీటైన అభ్యర్థులను బరిలో నిలిపే ప్రయత్నాలు చేస్తోంది. విజయనగరం, కాకినాడ, నర్సాపురం, రాజమండ్రి, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు స్థానాలపై ఫోకస్‌ పెంచింది.. ఒంగోలులో సిట్టింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి టిక్కెట్‌లేదని ఇప్పటికే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌ సంకేతాలు అందించినట్లు చెబుతున్నారు.

కాగా నరసరావుపేట సిట్టింగ్‌ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలుపు కష్టతరమని సర్వే నివేదికలు తేటతెల్లం చేయటంతో గత కొద్దిరోజులుగా ఆయన్ను గుంటూరు నుంచి పోటీ చేయాల్సిందిగా అధిష్టానం ప్రతిపాదనలు చేస్తోంది.. అయితే ఇదే లోక్‌సభ స్థానం పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు లావునే తిరిగి అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు.. ఈ సీటులో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలనేది ముఖ్యమంత్రి జగన్‌ మదిలో మాట. గా ప్రత్యామ్నాయాలపై కూడా ముమ్మరంగా సర్వేలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో తాను పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీకృష్ణ దేవరాయలు ప్రకటించటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.. గెలిచి తీరగలమనే ధీమా అభ్యర్థుల్లో ఉన్నప్పటికీ సర్వేలు, క్షేత్ర స్థాయి నివేదికలు, క్యాడర్‌ నుంచి అందిన సమాచారం, వ్యక్తిగత పనితీరు అన్నింటినీ పరిశీలించే మార్పులు అనివార్యమైన చోట సిట్టింగ్‌లను తప్పించి ప్రత్యామ్నాయ నియోజకవర్గాలను కేటాయించటంతో పాటు కొత్తవారిని రంగంలో దించుతున్నామనేది అధిష్టానం వాదన. ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తిరుపతిలో పర్యటించనున్నారు. పర్యటన పూర్తయితే సాయంత్రానికి ఐదో జాబితాను విడుదల చేయాలని వైసీపీ భావిస్తోంది.. లేదా గురువారం విడుదల చేయనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement