Tuesday, November 26, 2024

జగన్ కేబినేట్ లోకి ఇద్ద‌రు మాజీ మంత్రులు .. ఇద్ద‌రు ఎమ్మెల్సీలు?

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. గత వారం పది రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వివిధ సంఘటలను బట్టి చూస్తుంటే మరో నాలుగైదు రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ వర్గాల్లోనూ మంత్రివర్గ మార్పులపై జోరుగా చర్చ నడుస్తోంది. రాజకీయ వర్గాల్లోనూ ఇదే అంశంపై ప్రచారం సాగుతున్నది. అయితే మంత్రివర్గ మార్పుల్లో భాగంగా నలుగురు ఎమ్మెల్సీలకు కేబినెట్‌లో చోటు కల్పిస్తారని మొదట ప్రచారం జరిగినప్పటికీ తాజాగా అందులో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒకరిద్దరు మాజీ మంత్రులకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్‌ కూడా ఆదిశగానే ఒకరిద్దరు ఎమ్మెల్సీలతోపాటు ఇద్దరు మాజీలకు కీలకమైన శాఖలను అప్పగించాలన్న యోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లి టూర్‌లో ఉన్న జగన్‌ గురువారం రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు. శుక్ర, శని వారాల్లో మంత్రివర్గ చేర్పులు, మార్పులపై కసరత్తు చేయబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో మార్పులతోపాటు ప్రస్తుతం ఉన్న మంత్రులకు కొంతమందికి శాఖలు కూడా మార్చనున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ విస్తరణలో సామాజికవర్గాలకు మరింత ప్రాధాన్యతను కల్పిస్తూ ఆయా వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించేదిశగా అధిష్టాన పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాపై సీఎం జగన్‌ ప్రత్యేక ఫోకస్‌ పెట్టినట్లు చెబుతున్నారు. ఇటీవల క్రాస్‌ ఓటింగ్‌ నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన ముగ్గురు శాసనసభ్యులను పార్టీ నుండి సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో జిల్లాకు రెండో మంత్రి పదవి కట్టబెట్టి ఆ లోటును భర్తీ చేసే దిశగా సీఎం జగన్‌ ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. అదే జరిగితే మాజీ మంత్రి కొవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డికి జగన్‌ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే, రెడ్డి సామాజికవర్గానికి రెండో మంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తే ప్రకాశం జిల్లాకు చెందిన మరో సీనియర్‌ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేరును కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

నాలుగు సామాజివర్గాలకు స్థానం
ప్రస్తుతం జగన్‌ కేబినెట్‌లో 25 మంది మంత్రులు ఉన్నారు. అందులో సామాజికవర్గాల వారీగా వారికి ప్రాధాన్యతను కల్పించారు. అయితే, తాజాగా మంత్రివర్గంలో మార్పులు చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా నలుగురు మంత్రులను కేబినెట్‌ నుండి తొలగించి ఆస్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించబోతున్నారు. అయితే, మంత్రివర్గం నుండి అవుట్‌ అయ్యే మంత్రులకు సంబంధించిన సామాజికవర్గాలకే తిరిగి అవకాశం కల్పిస్తారా .. లేక .. మంత్రివర్గంలో శాఖల వారీగా భారీగా మార్పులు చేపడుతూ రెడ్డి, కాపు, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యతను కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. సీఎం జగన్‌ ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీల్లో ప్రాధాన్యతను కల్పించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిని విధంగా వెనుకబడిన సామాజికవర్గాలకు పెద్దల సభలో పెద్ద పీట వేసి సరికొత్త చరిత్రను సృష్టించారు. ఈనేపథ్యంలో మంత్రివర్గ మార్పుల్లో కూడా ఆయా సామాజికవర్గాలకు మరింత ప్రాధాన్యతను ఇవ్వబోతున్నారన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఇదే సందర్భంలో సొంత సామాజికవర్గమైన రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యతను తగ్గిస్తున్నారన్న అసంతృప్తి కూడా ఆయా వర్గాల్లో వ్యక్తమవుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని తాజా మార్పుల్లో భాగంగా ఒకరిద్దరు రెడ్లకు ప్రాధాన్యతను కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన మర్రి రాజశేఖర్‌కు కూడా కేబినెట్‌లో చోటు దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో కమ్మ సామాజికవర్గానికి కూడా అవకాశం కల్పిస్తారన్న వాదన లేకపోలేదు.

నెల్లూరు జిల్లాపై ఫోకస్‌
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న నెపంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మూడు బలమైన రాజకీయ కుటుంబాలకు సంబంధించిన ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కోటంరెడ్డి శ్రీథర్‌ రెడ్డిలను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. రెడ్లకు ప్రాధాన్యత కలిగిన జిల్లాగా పేరుగాంచిన నెల్లూరు వైసీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో 10కి 10 ఎమ్మెల్యే స్థానాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలను కూడా వైసీపీ సొంతం చేసుకుంది. 2014 ఎన్నికల్లో కూడా 10 నియోజకవర్గాల్లో 7 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. రెండు పార్లమెంటు స్థానాలను గెలుపొందింది. వైసీపీకి పార్టీ పరంగా కడప జిల్లా కంటే నెల్లూరు జిల్లాలో మరింత బలంగా ఉంది. ఇటువంటి పరిస్తితుల్లో ఒకే సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఒకేసారి సస్పెండ్‌ చేయడంతో జిల్లా పార్టీలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్‌ ఆ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా సీనియర్‌ నేత మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డికి అవకాశం కల్పించొచ్చన్న ప్రచారం కూడా జోరుగా సాగుతున్నది. జిల్లా నుండి ఇప్పటికే వ్యవసాయ శాఖా మంత్రిగా కాకాని గోవర్ధన్‌ రెడ్డి జగన్‌ కేబినెట్‌లో రానిస్తున్నారు. జిల్లాకు రెండో మంత్రి పదవి కేటాయించడం ద్వారా పార్టీని మరింత పటిష్టం చేయడంతోపాటు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ మూడ్‌ నుండి పార్టీ కేడర్‌ను బయటకు తీసుకొచ్చే దిశగా సీఎం జగన్‌ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

నాలుగు రోజుల్లో కేబినెట్‌ విస్తరణ
2019 మే 30వ తేదీ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్‌ 8వ తేదీ తొలి కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 30 నెలల తరువాత గత ఏడాది ఏప్రిల్‌ 8వ తేదీ మంత్రివర్గ విస్తరణను చేపట్టారు. అదే నెల 11వ తేదీ కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. అయితే వచ్చే నెల 8తో ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న మంత్రులకు ఏడాది కాలం పూర్తికావస్తున్న నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేపట్టాలని సీఎం జగన్‌ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే మరో నాలుగు రోజుల్లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement