Friday, November 22, 2024

Adoni: జగనన్న విద్యాకానుక విద్యార్థులకు వరం.. మంత్రి బుగ్గన

జగనన్న విద్యాకానుక విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఓ వరమని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి బుగ్గన పాల్గొన్నారు. తన చిన్నతనంలో కొత్త బట్టలు, షూలు లేకపోవడం లోటుగా అనిపించేదన్నారు. విద్యార్థులకు చిన్నతనంలో సహజంగా ఉండే సూక్ష్మమైన విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తమకు లేదనే బాధలేకుండా విద్యార్థులందరికీ సమానంగా అన్నీ ఉండాలనే జగనన్న విద్యాకానుక తీసుకొచ్చారన్నారు. గత నాలుగేళ్ల క్రితం వరకూ టాయిలెట్ల వసతి సహా మౌలిక సదుపాయాలు సమగ్రంగా ఉండేవి కావన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు. వాగులు, వంకలు దాటి, రోడ్లు, లైట్లు, రవాణా సౌకర్యాలు సహా ఏ వసతిలేని కాలంలోనే ఎంతో మంది సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారన్నారు. అన్ని వసతులు సమకూరుతున్న నేపథ్యంలో ఇక సమాజాన్ని మార్చేలా, మీ కుటుంబాన్ని నిలబెట్టేలా విద్యనభ్యసించాలన్నారు. సదుపాయాల కల్పన బాధ్యతంతా ప్రభుత్వానిది, కష్టపడి చదివి ఎదిగే పని మాత్రమే మీదని మంత్రి బుగ్గన అన్నారు.


నచ్చిన రంగంలో రాణించండి.. స్వేచ్ఛగా ఎదగండి :
మొట్టమొదట బల్బ్ కనిపెట్టి ప్రపంచానికే వెలుగు పంచిన సైంటిస్ట్ థామస్ అల్వా ఎడిసన్ చిన్నతనం నాటి కథను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారన్నారు. 60 ఏళ్ల వయసులో టెలిగ్రాఫ్ కనిపెట్టే సమయంలో అగ్ని ప్రమాదం జరిగినా మళ్లీ పట్టుదలతో టెలిగ్రాఫ్ ని కనిపెట్టారు.. పట్టుదలను వీడవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంజీవ్ కుమార్, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్, మండలి సభ్యులు మధుసూదన్, కర్నూలు జిల్లా కలెక్టర్ జి.సృజన, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement