తాడేపల్లి (అమరావతి): ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మంత్రి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ… 11 రకాల ధృవపత్రాలను ఇంటింటికీ వెళ్లి అందిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సీఎం జగన్ 99.5 శాతం సంక్షేమ ఫలాలు అందించారని, నూటికి నూరు శాతం లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించాలన్నదే జగన్ ఉద్దేశమన్నారు.
ప్రజలను జల్లెడ పట్టి వారి సమస్యలను గుర్తించి సిబ్బంది పరిష్కరిస్తారన్నారు. కార్యక్రమం పర్యవేక్షణకు 26 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారన్నారు. 5 కోట్లకు పైగా ప్రజలకు 1.60 కోట్ల కుటుంబాలను కలసి సమస్యలను గుర్తిస్తారని, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వందకు వంద శాతం విజయవంతం చేయాలని సీఎం ఆదేశించారన్నారు.