Friday, November 22, 2024

జగనన్న కాలనీలకు కొత్తకళ.. దశల వారీగా నిర్మాణ ప్రగతి..

గూడులేని పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గృహ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 1.91 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేసింది. ప్రభుత్వం అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఇళ్లుకూడా నిర్మిస్తున్నది. తొలివిడతలో భాగంగా జిల్లాలో 1.07 లక్షల మందికి ఇళ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఏడాది దాటిపోవడం.. కొన్న చోట్ల పనులు నత్తనడకన సాగుతుండటంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా జగనన్న కాలనీలు పూర్తి చేసేందుకు అధికారులు రంగంలో దిగారు. తొలి విడతలో ఇళ్లు మంజూరు చేసిన ప్రారంభించని లబ్ధిదారులకు నోటీసులు ఇస్తున్నారు. ఏడాదైన ఇంకా ఎందుకు ప్రారంభించలేదనే అంశంపై వివరణ తీసుకుంటున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల్లో టెన్షన్‌ మొదలైంది. కరోనా పరిస్ధితులు, ఆదాయం తగ్గిపోవడంతో పాటు ఇళ్ల నిర్మాణా సామగ్రి ధరలు పెరగడం తదితర కారణాల వల్ల ఇళ్లను ప్రారంభించలేదని చాలా వరకు లబ్ధిదారులు తమకు అందిన నోటీసులకు సమాధానం ఇస్తున్నారు. అంతేకాదు మరి కొందరు అప్షన్‌ 3 ప్రకారం ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక అప్షన్‌ -2కు పెద్దగా కదలిక లేదు. దీంతో చాలా వరకు లబ్ధిదారులే ఇళ్లను నిర్మించి కోవాల్సి వస్తున్నది. ఈ ఆప్షన్‌ ప్రకారం ప్రభుత్వం రూ. 1.80 లక్షలు మంజూరు చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఎందుకు సరిపోవడం లేదని లబ్దిదారులంటున్నారు. పైగా పౌండేషన్‌ పూర్తిచేస్తే గాని ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో పునాది వేసేందుకే దాదాపు లక్ష ఖర్చయ్యే పరిస్ధితి నెలకొంది. చాలా వరకు ఇళ్ల స్థలాలు, పంట భూముల్లో, పల్లపు ప్రాంతాల్లో ఉండటంతో పునాదులను 5 నుంచి 8 అడుగుల వరకు వేయాల్సి వస్తుంది. దీంతో ఖర్చు పెరుగుతుందని లబ్ధిదారులు అంటున్నారు.

మొదటి విడతలో 1,07 లక్షల ఇళ్లు..

నవరత్నాల పథకంలో భాగంగా జిల్లాలో జగనన్న ఇళ్ల కింద మొత్తం 1.91,781 మందికి ఇంటి పట్టాలు ఇచ్చారు. వీటిలో జగనన్న ఇంటి నిర్మాణం కింద జిల్లాలో మొదటి 1,07,866 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు రూ. 2వేలకోట్లను ఖర్చు చేయదలిచారు. అయితే జిల్లాలో చాల వరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు మందుకు రాలేదు. ఇప్పటి వరకు జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తే 52,804 గృహాలు పూర్తిగా పునాది స్థాయిలో ఉండగా, 4,708 గృహాలు పునాది స్థాయిలో 1,420 గృహాలు రూఫ్‌ లెవల్‌, 2,065 గృహాలు రూఫ్‌ స్ధాయిలో ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం 2,065 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తంగా జిల్లాలో మంజూరు అయిన గృహాలలో 61,233 గృహాలు మొదలెట్టారు. బిలో బేష్‌మెంట్‌ లెవల్‌ నుంచి వివిధ దశల్లో 8,429 గృహాలకు సంబంధించి నిర్మాణాలను అధికారులు వేగవంతం చేశారు. ఇక వీటిలో 38565 ఇళ్లను సొంత స్థలాలు కాగా, వీటిలో నేటికి 22వేల ఇళ్లను అసలు ప్రారంభించలేదు. ఇక లే అవుట్‌లలో 69,212 ఇళ్ల నిర్మాణాలకు గాను 29,215 ఇళ్లు ఇంకా ప్రారంభించలేదు. బేస్‌మెంట్‌ స్థాయికి దిగువన 39,997 ఇళ్లు ఉండగా, ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.70.50 కోట్లు జమకాగా, ఇక ప్రారంభమైన నిర్మాణాలకు సంబందించి రూ.63.75 కోట్లను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. మిగిలినవి మెటీరియల్‌ కాస్టు కింద జమ చేయడం జరిగింది.

ఇక మంజూరైన వాటిలో నంద్యాల డివిజన్‌లో 146 లే అవుట్‌లలో 25,273 ఇళ్లు ఉండగా, ఇందులో లే అవుట్‌లో 9961 ఇళ్లు, పొజిషన్‌ సర్టిఫికెట్‌లవి 821, సొంత స్థలాల్లో 14491 ఇళ్లు ఉండటం విశేషం. నంద్యాల డివిజన్‌కు సంబందించి బిబిఎల్‌లో 3162, బేస్‌మెంట్‌ లెవల్‌లో 395, రూఫ్‌ లెవల్‌లో 231, రూఫ్‌ కాస్టులో 610 ఉన్నాయి. మొత్తంగా జగనన్న ఇళ్ల నిర్మాణం కింద జిల్లాలో మొదటి విడత 1.07 లక్షల ఇళ్లు ఏడాది క్రితం మంజూరు కాగా, నేటి వరకు 3వేల ఇళ్లు కూడా పూర్తికాకపోవడంతో ఈ విషయంపై ముఖ్యమంత్రి సీరియస్‌గా పరిగణించారు. కర్నూలు జిల్లాలో జగనన్న ఇళ్లను త్వరిగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంకా ఇంటి నిర్మాణం ఎందుకు చేపట్టలేదు. కారణాలేంటి అనే అంశాలపై లబ్ధిదారుల నుంచి లిఖిత పూర్వకంగా తీసుకుంటున్నారు. నిర్దేశిత సమయంలో ఇంటి నిర్మాణం ప్రారంభించకుంటే ప్రభుత్వం ఇచ్చే రాయితీ రద్దవుతుందని అధికారులు చెబుతున్నారు. నోటీసు ఇచ్చిన 15 రోజుల్లో ఇంటి నిర్మాణం చేపడితే ఎలాంటి సమస్య ఉండద ంటున్నారు. అంతేకాదు ఇంటి నిర్మాణం ప్రారంభించకుంటే స్థలాన్ని వెనక్కితీసుకొని ఇతరులకు కేటాయిస్తామని వాలంటీర్లు మెడపై కత్తిపెట్టడంతో కొందరు తప్పని పరిస్ధితుల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు సిద్దమవుతున్నారు.

జగనన్న ఇళ్లతో కొత్త కాలనీలు..

- Advertisement -

గూడు లేని పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న తలంపుతో ప్రభుత్వం చేపడుతున్న జగనన్న గృహ నిర్మాణాలతో జిల్లాలో చాలా వరకు నగర, పట్టణ, మండల, గ్రామీణ స్థాయిలో నూతన కాలనీలు ఉద్భవిస్తున్నాయి. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టిన పలు కాలనీలలో రోడ్లు, మౌళిక వసతుల కల్పనలో అధికారులు ఉన్నారు. వీటి లో ప్రధానంగా రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్‌ దీపాల వంటి వాటిపై దృష్టి సారించారు. ఇక లబ్ధిదారులే తమ ఇళ్లను పూర్తిచేసుకునేందుకు ముందుకు రావాల్సి ఉంది. ఆవైపు ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా అధికారులను కదిలిస్తుంది. మొత్తంగా జగనన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే జిల్లాలో అనేక చోట్ల కొత్త కాలనీల కళ నెలకొననుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement