Friday, November 22, 2024

జగన్ ను గద్దె దింపుతా – చర్లపల్లి జైలుకి పంపుతా … పవన్ కల్యాణ్

అమరావతి: రాష్ట్రం కోసం జైలు కెళ్లడానికి, దెబ్బలు తినేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వైకాపాను వీడిన ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు గురువారం మంగళగరిలోని కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్ పార్టీ కండువా కప్పి రమేశ్‌బాబును జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ రమేశ్‌బాబుకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఏపీ బాగుండాలంటే జగన్ పోవాలన్నారు. జగన్‌ను ఇంటికి పంపడమే తమ ఏకైక లక్ష్యమన్న ఆయన.. కుదిరితే చర్లపల్లి జైలుకు పంపుతానంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ అన్నీ మింగేస్తాడని అప్పుడే చెప్పానని.. ఇప్పుడు విశాఖలో రిషికొండను మింగేశారని ఆరోపించారు. ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో భూకబ్జాలు, గొడవలు జరుగుతున్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో కింది స్థాయి అధికారి తప్పు చేస్తే పై అధికారికి ఫిర్యాదు చేయొచ్చని.. వాలంటీర్ 8 ఏళ్ల బిడ్డను రేప్ చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అసలు వాలంటీర్లకు అధిపతి ఎవరు అని ఆయన నిలదీశారు. జనవాణి కార్యక్రమానికి స్పూర్తినిచ్చింది ఓ మహిళా వాలంటీర్ అని పవన్ గుర్తుచేశారు. తాడేపల్లిలో సీఎం ఇంటికి సమీపంలో రోడ్ వైడ్‌నింగ్‌లో ఇల్లు పోయింది, న్యాయం చేయమని తనను ఆ వాలంటీర్ కోరిందని ఆయన తెలిపారు. దీనిపై తాను మాట్లాడినందుకు ఆమె అన్నయ్యని చంపేశారని.. ఇప్పటికీ పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇవ్వలేదని పవన్ దుయ్యబట్టారు. జగన్‌కు తన మన అన్న భేదం లేదని.. అనకొండలా అన్నీ మింగేస్తాడని ఎద్దేవా చేశారు. ఏ పార్టీ నుంచి జనసేనలోకి వచ్చినా మనస్పూర్తిగా ఆహ్వానిస్తానని కానీ కమిట్‌మెంట్‌తో పనిచేయాలని పవన్ కల్యాణ్ కోరారు

”వాలంటీర్లపై మాట్లాడినందుకు నన్ను ప్రాసిక్యూట్‌ చేయమని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఒక సారి మాట చెబితే అన్ని రిస్క్‌లు తీసుకునే చెబుతా. నన్ను అరెస్టు చేసుకోండి.. చిత్రహింసలు పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైన సిద్ధంగా ఉన్నా. మీరు ప్రాసిక్యూషన్‌ అంటే నేను సిద్ధంగానే ఉన్నా. న్యాయం కోసం మాట్లాడితే నోటీసులు వస్తాయి. హత్యలు చేసిన వాళ్లను ఎలా కాపాడుతున్నారో చూస్తున్నాం. మీరు చేసే పనులు కోర్టులు కూడా చూస్తున్నాయి. ఒక్కో వాలంటీరుకు ఇచ్చే రోజు వేతనం 164 రూపాయలు. డిగ్రీ చదివిన వారికి ఉపాధి హామీ పథకం కంటే తక్కువ వేతనం చెల్లిస్తున్నారు. వాలంటీర్లతో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు. 23 అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించి ఎక్కడికి పంపుతున్నారు?ఇది డేటా చౌర్యం కిందకు వస్తుంది. సమాచారం సర్వర్‌లో పెట్టుకున్నా నేరమే. వ్యక్తిగత సమాచారం భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. సమాచార సేకరణపై ప్రభుత్వ విధి విధానాలు ఏమిటి?వాలంటీర్లు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. సేకరించిన సమాచారం ఏటా ఒక కంపెనీకి ఇస్తున్నారు. సమాచార చౌర్యంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తా. రెడ్ క్రాస్‌ వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేస్తారు. రాష్ట్ర స్థాయిలో గవర్నర్‌, దేశ స్థాయిలో రాష్ట్రపతి వారికి అధ్యక్షత వహిస్తారు. కానీ, వాలంటీర్ల విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటారు. వాలంటీర్లు సేకరించిన డేటా హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలోని ఓ ఎజెన్సీకి వెళ్తోంది. ఆ కంపెనీ వైకాపా నేతలదని చెబుతున్నారు. నన్ను ప్రాసిక్యూట్‌ చేయమని జీవో ఇచ్చారు.. నీ ప్రభుత్వాన్ని కిందకు దించేది ఈ జీవోనే. మైనింగ్‌ అక్రమాల సంగతి కూడా చూస్తాం. కేసులకు భయపడే వ్యక్తిని అయితే పార్టీ ఎందుకు పెడతాను. ఎక్కడికి వచ్చి అయినా నన్ను విచారించుకోవచ్చు” అని పవన్‌ కల్యాణ్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement