Thursday, November 21, 2024

AP: రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టిన జ‌గ‌న్ ను ఓడించాలి… ష‌ర్మిల‌

మడకశిర: పెద్ద కోటలు కట్టుకొని అందులో ఉండే జగన్‌.. ఎన్నికలు ఉన్నాయని ‘సిద్ధం’ పేరుతో బయటకు వస్తున్నారని, ఆయన ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఏనాడూ ప‌ట్టించుకోలేద‌ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. వైఎస్ఆర్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్త‌యింద‌న్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి 127 చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పిన వైకాపా.. ఆ హామీని మరిచిందని విమర్శించారు. ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తామన్నారని.. ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. లెదర్ పార్కు హామీని సైతం మరిచారని ఆరోపించారు. మడకశిర నియోజకవర్గం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

”ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని లాంటిది. దానితో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవి. కానీ ఈ విషయంలో భాజపా మోసం చేసింది. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్ తాకట్టు పెట్టారు. ఒక్క సీటు లేని భాజపా.. రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. ఏపీ గురించి పట్టించుకోని జగన్ అవసరమా ? హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే. ఈ హామీని ఏఐసీసీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక 2.25 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేస్తాం. ప్రతి మహిళ పేరు మీద రూ.5 లక్షలతో పక్కా ఇళ్లు నిర్మిస్తాం. వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్‌ అందిస్తాం. పెద్ద కోటలు కట్టుకొని అందులో ఉండే జగన్‌.. ఎన్నికలు ఉన్నాయని ‘సిద్ధం’ పేరుతో బయటకు వస్తున్నారు. ఏనాడైనా ప్రజల సమస్యలను ఆయన విన్నారా ? వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బార్ ఉండేది. వారసుడి పాలనలో ఎక్కడికి పోయింది?” అని షర్మిల నిలదీశారు.

వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు మద్దతుగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. న్యాయం కోసం తాము పోరాడుతున్నామని.. షర్మిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

- Advertisement -

”ప్రజలను కదిలిస్తే ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. అందరిలోనూ చెప్పుకోలేని బాధ ఎక్కువగా ఉంది. పులివెందుల ప్రజలతో పాటు నేనూ బాధపడుతున్నా. దీన్ని మే 13న జరిగే ఎన్నికలలో ఓట్ల రూపంలో చూపించాల్సిన అవసరముంది. వివేకానందరెడ్డిని దారుణంగా చంపించిన వారిని ఓడించాలి. ఆయన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు. వీటన్నింటికీ ప్రజలే ఓట్ల ద్వారా తీర్పు చెప్పాలి” అని సునీత కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement