Friday, November 22, 2024

న్యాయ నిపుణుల స‌ల‌హాతో మూడుపై ముందుకే..

కేంద్ర అఫిడవిట్‌లో సానుకూలాంశాలు
23న సుప్రీంకోర్టులో వాదనలకు పదును
తెరపైకి శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక
సిఫార్సులు తిరగేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి, ఆంధ్రప్రభ: మూడు రాజధానుల అంశానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాతో ఓ అడుగు ముందుకేసేందుకు ప్రభుత్వం ప్రయత్నా లు ప్రారంభించింది. ఇందులో భాగంగా అడ్వకేట్‌ జనరల్‌తో పాటు సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతోంది.. అమరావతే రాజధాని అంటూ గత ఏడాది మార్చి 3వతేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై ఈనెల 23వ తేదీన బలమైన వాదనలు వినిపించేందుకు కసరత్తు జరు పుతోంది. హైకోర్టుతీర్పులో అమరావతిని ఆర్నెల్లలో అభివృద్ధి చేయాలనే కాల పరిమితి అంశాలపై స్టే విధించిన నేపథ్యం లో అసలు రాజధాని వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఈ విషయంలో కోర్టుల జోక్యం తగదనే వాదనతో సుప్రీంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. అయితే సుప్రీంకోర్టు కాలపరిమితిపై విధించిన స్టేను ప్రభుత్వంతో సహా ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నాయి. అంతిమంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సమర్పించిన అఫిడవిట్‌లో సైతం కేంద్ర ప్రభుత్వం మధ్యేమార్గంగా వ్యవహరించిందనేది స్పష్టమవుతోంది..

రాష్ట్ర పునర్విభజన నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి సంబంధించి శివరామకృష్ణన్‌ కమిటీని నియమించామని అయితే పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ కొనసాగుతుందని పునరుద్ఘాటించింది. 2014 జూన్‌ 2వ తేదీన రాష్ట్ర పునర్విభజన నోటిఫికేషన్‌ విడుదలైంది. అప్పటి నుంచి పదేళ్ల పాటు అం టే 2024 వరకు హైదరాబాద్‌ రాజధానిగానే మనుగడలో ఉంటుంది. ఇందులో భాగంగానే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అంతేకాదు షెడ్యూల్‌ 9, 10 ఆస్తుల విభజన, విద్యుత్‌ బకాయిలు, పంపకాలకు సంబంధించి ఇంకా లెక్కలే తేలలేదు. రాష్ట్ర విభజనలో అన్యాయం జరిగిందని ప్రధాన రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. జనాభా దామాషా ప్రకారం ఆస్తుల పంపకాలు వదిలేసి అప్పులు మాత్రం మిగిల్చారనే వాదన ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి రాజధానిని వదిలేసి అర్థంతరంగా అమరావతిని రాజధానిగా గత ప్రభుత్వం ఎంపిక చేసిందని ఏడాదికి మూడు పంటలు పండే పుష్కలంగా వనరులు ఉన్న ప్రాంతాన్ని కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చటం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలకు విరుద్ధమనే విమర్శలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు తగదని కేంద్రం విభజన చట్టం ప్రకారమే నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ తేల్చిచెప్పినా గత తెలుగుదేశం ప్రభుత్వం పెడచెవిన పెట్టి అమరావతిని రాజధానిగా ప్రచారం చేసుకుందని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణ. దీంతో శివరామకృష్ణన్‌ నివేదికలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే విచారణలో సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో హైకోర్టు తీర్పుతో పాటు శివరామకృష్ణన్‌, శ్రీకృష్ణ కమిటీ నివేదికలతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత నియమించిన జీఎన్‌ రావ్‌, బోస్టన్‌ కమిటీ ప్రతిపాదనలతో సహా మొత్తం 18 వందల పేజీలతో ఎస్‌పీఎల్‌ దాఖలు చేసింది. కమిటీల సిఫార్సులు, హైకోర్టు తీర్పును పరిశీలించాకే సుప్రీం తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమరావతికి కేంద్రం కేటాయించిన నిధుల్లో కేవలం 600 కోట్లు మాత్రమే వెచ్చించి తాత్కాలిక భవనాలు నిర్మించారని అందువల్ల ఇది శాశ్వత రాజధాని కానేకాదనే విషయాన్ని సుప్రీంకు నివేదించాలని ప్రభుత్వం భావిస్తోంది.. రాజధాని ప్రకటనకు ముందే ఈ ప్రాంతంలో భూముల కొనుగోలు జరిగిన తీరు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విజిలెన్స్‌, సీఐడీ నివేదికలు, కేంద్ర కమిటీల సిఫార్సులను కూడా సుప్రీం ముందుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటి వరకు శాశ్వత రాజధాని కోల్పోయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మిగిలిందని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రాంతాల మధ్య అసమానతలు పొడసూపకుండా పాలనా వికేంద్రీకరణ చేస్తే తప్పేంటనే విషయాన్ని ప్రస్తావించేందుకు ప్రభుత్వ న్యాయనిపుణులు సన్నద్ధమవుతున్నారు. మూడు రాజధానుల అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఈ వ్యవహారంపై వెనక్కుతగ్గే పరిస్థితిలేదు. తరలింపు పేరుతో కాకుండా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం అక్కడ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే పాలనా వ్యవహారాలు కొనసాగించే అంశంపై దృష్టి సారించింది.

శివరామకృష్ణన్‌ కమిటీ ఏం చెబుతోంది
కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కే శివరామకృష్ణన్‌ నేతృత్వంలో విభజన చట్టం ప్రకారం రాజధాని ఎంపికకు సంబంధించి ఫైవ్‌మెన్‌ కమిటీని కేంద్రం అప్పట్లో నియమించింది. రతిన్‌ రాయ్‌, ఆరోమర్‌ రెవి, జగన్‌షా, కేటీ రవీంద్రన్‌లు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను సేకరించింది. అవశేష ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు రీజియన్లుగా వర్గీకరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలన ుఉత్తరాంధ్రగా, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటుూరు జిల్లాలను మధ్యాంధ్ర, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కోస్తాంధ్ర, చిత్తుూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను రాయలసీమ జిల్లాలుగా వర్గీకరించింది. విజయవాడ- గుంటూరు మార్గంలో రాజధాని ఏర్పాటు కష్టతరమని ఆర్థికాభివృద్ధితో పాటు పర్యావరణ అంశాలు తలెత్తుతాయని వివరించింది. అంతేకాదు భూకంపాల జోన్‌-3 పరిధిలో కృష్ణా తీర గ్రామాలు ఉన్నాయని రివర్‌ ఫ్రంట్‌ రాజధానులు అభివృద్ధికి నోచుకోలేదనేది స్పష్టం చేసింది. విజయవాడ- గుంటూరు- మంగళగిరి- తెనాలి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ కూడా కష్టమని తేల్చిచెప్పింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన సందర్భంగా కర్నూలు ప్రాంతానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సి ఉందని అభిప్రాయపడింది. రాజధానిలో శాసనషభ, సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం ఉండాలని గుంటూరు- చెన్నై సెంట్రల్‌ రైల్వే కారిడార్‌లో కాళహస్తిని రైల్వేజోన్‌గా ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉంటుందని ప్రతిపాదించింది. హైకోర్టును విశాఖపట్నంలో ఏర్పాటు చేయటంతో పాటు హైకోర్టు బెంచిని అనంతపురం లేదా కర్నూలులో ఏర్పాటుకు సిఫార్సు చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాలు వ్యవసాయాధారిత ప్రాంతాలైనందున భూ సేకరణకు అవరోధంగా ఉంటుందని ప్రకాశం జిల్లా మార్టూరు- గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసింది. అంతేకాదు ముసునూరు, మంగళగిరి, మాచర్ల, గొల్లపల్లి, వినుకొండ, మార్టూరు, దొనకొండ, పులిచింతలను క్యాపిటల్‌ రీజియన్లుగా గుర్తించింది. ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాథి కల్పన, కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలను రాజధానికి అనువైనవిగా సిఫార్సు చేసింది. అయితే గత ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి నిర్మాణాలు ప్రారంభించింది. అన్ని ప్రాంతాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే శివరామకృష్ణన్‌ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవటం ద్వారా మూడు రాజధానులకు క్లియరెన్స్‌ వచ్చేలా సుప్రీంలో వాదనలకు ఏపీ సర్కార్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement