Saturday, November 23, 2024

AP | మారు మూల గ్రామాలకు 4జీ సేవలు… టవర్ లు ప్రారంభించిన జగన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ 4జీ నెట్‌వర్క్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంతో దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో పెద్ద సంఖ్యలో 4జీ సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఇవ్వాల (గురువారం) తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్‌గా 164 సెల్‌టవర్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.

ఇప్పటికే, మరో టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ ఆధ్వర్యంలో 136 సెల్ టవర్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయగా.. జియో ఆధ్వర్యంలో కొత్తగా మరో 164 టవర్లు ఏర్పాటు చేసింది. దాంతో ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 300 వరకు 4జీ నెట్‌వర్క్ టవర్లను ఏపీ సీఎం ప్రారంభించారు.

దాదాపు 400 కోట్లు ఖర్చు చేశాం : సీఎం జగన్

4జీ సెల్ టవర్లను ప్రారంభించిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా ప్రాంతాల గిరిజనులతో సీఎం జగన్ మాట్లాడారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని టవర్లను జియో విస్తరించనుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమైందని తెలిపారు. దాదాపు 5,549 మారుమూల గ్రామాలకు 4జీ సర్వీసులను అందించాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం జగన్ చెప్పారు. 4జీ సెల్ టవర్ల ఏర్పాటు కోసం దాదాపు 400 కోట్లు ఖర్చు చేశామన్నారు.

- Advertisement -

400 టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఇవాళ ఏర్పాటు చేసిన కొత్త టవర్ల ద్వారా మరో 2 లక్షల మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఏపీ సీఎం చెప్పారు. మొత్తంగా కలిపి 2887 టవర్లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం మొత్తంగా రూ. 3,119 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇప్పటికే టవర్లకు అవసరమైన భూములను కూడా వెంటనే అప్పగించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఐటీ సెక్రటరీ కోన శశిధర్, జియో ఆంధ్రప్రదేశ్ సీఈవో మందపల్లి మహేష్ కుమార్, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement