మూడున్నరేళ్లలో సంక్షేమ రాజ్యంగా ఏపీ
ప్రజాసంకల్ప పాదయాత్రకు నేటితో నాలుగేళ్లు
ఇచ్ఛాపురంలో సరిగ్గా ఇదేరోజు ముగిసిన యాత్ర
అమరావతి, ఆంధ్రప్రభ: వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రకు సోమవారంతో సరిగ్గా ఆరేళ్లు పూర్తయ్యాయి. దేశ రాజకీయాల్లోనే ఈ యాత్ర ఓ సంచలనం సృష్టించి చరిత్రకెక్కింది. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తేవాలన్న సంకల్పంతో వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్ 6న జగన్ తన పాదయాత్రకు తొలి అడుగు వేశారు. ప్రజల వద్దకు వెళ్లి స్వయంగా వారి కష్టాలు తెలుసుకుని కన్నీళ్లను తుడిచారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చి హామీలను మేనిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పొందుపరచిన 98 శాతం హామీలను మూడున్నరేళ్లలోనే నెరవేర్చారు. కోట్లాది హృదయా లను స్పృశించిన ప్రజా సంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజక వర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు- 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైయస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను కలుసుకోని వర్గం అంటూ లేదు. జయహో జగన్ అంటూ తరలి వచ్చిన ప్రజా నీకం తమ సాధక బాధకాలను తెలి యచేసింది. పూలబాట పరచి అపూ ర్వ స్వాగతం పలికారు. నుదుట కుంకుమ దిద్దారు. నిరుపేద మహిళ లు, చేయూతకు నోచుకోని వృద్ధులు, అనాధలు, ఉపాధి లేని యువత, విద్యార్థులు, రైతన్నలు పాదయా త్రలో భాగస్వాములయ్యారు.
హామీల నుంచి అధికారం వరకు…
పాదయాత్రలో వైయస్ జగన్ అనే నేను..అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, భరోసాలే ‘వైయస్ జగన్ అనే నేను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను..’అని చెప్పే వరకు నడిపించాయి. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికారత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, నాడు – నేడు కార్యక్రమాల ద్వారా ఇంకా నడిపిస్తునే ఉన్నాయి. 2019 మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల వైఎస్సార్ సీపీ ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టు-బడి అవ్వాతాతల పింఛన్ ను రూ.2,250కి పెంచుతూ సీఎం జగన్ తొలి సంతకం చేశారు. మంత్రివర్గ కూర్పులో తనదైన శైలిని కనబరిచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ- వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయ సంచలనం సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్ల్రో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీ-లకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి చరిత్రను తిరగరాశారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఏకంగా 19 చట్టాలు చేశారు.
సంక్షేమం, అభివృద్ధి
మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తానని తొలిరోజే ప్రకటించిన సీఎం జగన్ అందులో పేర్కొన్న నవరత్నాల అమలును వడివడిగా చేపట్టారు. భారీ ఎత్తున సంక్షేమాభివృద్ధి పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినే-టె-డ్ కాంట్రాక్టుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు- చేశారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దిశ బిల్లు రూపొందించి కేం ద్రానికి పంపారు. దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళ లకు అండగా నిలిచారు. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి జరగా లనే దృఢ సంకల్పంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకు న్నారు. అన్ని ప్రాంతాలు సమా నంగా అభివృద్ధి చెందాలని, అన్ని కులాలు రాజకీయంగా సమానంగా ఎదగాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. ఇవన్నీ ఒక ఎత్తు కాగా కోవిడ్ కష్ట కాలం లోనూ నిర్విఘ్నంగా సంక్షేమ పథకాలు అందించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం మరోఎత్తు. ఒక వైపు గత సర్కారు రాష్ట్రాన్ని ఊహకు అందనంత అప్పుల్లో ముంచెత్తి ఖాళీ ఖజానా అప్పగించింది.
మరో వైపు ప్రపంచవాప్తంగా మహమ్మారి కరోనా కమ్మేసింది. అయినా సరే మొక్కవోని దీక్షతో ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్రానికి పునరుజ్జీవం కల్పించారు. సచివాలయ వ్యవస్థతో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని కళ్లెదుట ఆవిష్కరించారు.
పెత్తందార్లకు వ్యతిరేకంగా పోరాటం…
ఒకవైపు ఖాళీ ఖజానా, మరోవైపు కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో అధికారం లోకి వచ్చిన సీఎం జగన్ సంక్షేమ రాజ్యాన్ని విస్తరిస్తూ వచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాటను తూ.చ.తప్పకుండా ఆచరిస్తూ వస్తుంటే తమకు ఇక రాజకీయ మనుగడ లేదని భావించిన కొన్ని పార్టీలు అసత్య ప్రచారాలకు తెరదీశాయి. పెత్తందార్లుగా పేరుగడించిన ఆ పార్టీ ముఖ్యులు అదేపనిగా విమర్శల బాణాలు సంధిస్తున్నా మొక్కవోని ఆత్మస్థైర్యంతో తన ప్రయానాన్ని ముందుకు సాగిస్తున్నారు. అందుకే ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన తన సంక్షేమాన్నే చూపుతూ మళ్లి 2024 ఎన్నికలకు సమాయత్తమవు తున్నారు. పెత్తందార్ల భోజ్యానికి, సంక్షేమ రాజ్యానికి మధ్య యుద్ధం జరగబోతోందంటూ ఆయన పదే పదే ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.