అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ద్వితీయ స్థాయి నాయకులకు పార్టీలో మరింత ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను కల్పించాలని వైసీపీ అధిష్టానం యోచిస్తోంది. నెల్లూరు తరహాలో శాసనసభ్యులు తిరుగు బాటు బావుటా ఎగురవేసే సందర్భంలో కొంత మంది సెకండ్ క్యాడర్ నాయకులు రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇకనుండి ద్వితీయస్థాయి నాయకులతో నేరుగా సంబంధాలు ఏర్పర్చుకోవాలని ఆదిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకూ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ అధిష్టానంతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో సెకండ్ కేడర్ నాయకులంతా మంత్రులు, ఎమ్మెల్యేలకు అనుచరులుగానే ఉండిపోతున్నారు. వారికి ఏదైనా రాజకీయంగా ఇబ్బంది వస్తే స్థానికంగా ఉన్న శాసనభ్యులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అదిష్టాన పెద్దలను నేరుగా కలిసి వారి సమస్యను చెప్పుకునే పరిస్థితి లేదు. ఈనేపథ్యంలోనే ఇక నుండి ఆ తరహా ఇబ్బందులను వైసీపీలోని ద్వితీయ స్థాయి నేతలు ఎదుర్కోకూడదన్న ఆలోచనతో సీఎం జగన్ సెకండ్ కేడర్ నాయకులందరినీ వేర్వేరు సందర్భాల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఆయా జిల్లా పర్యటనకు వెళ్లే సందర్భంలో స్థానిక శాసససభ్యులతోపాటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమైన ద్వితీయ స్థాయి నాయకులకు కూడా ఆ సమావేశంలో పాల్గొనే ఆహ్వానాన్ని అందించబోతున్నారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో వారి సమస్యలను కూడా తెలుసుకుని ఎక్కడిక్కడే పరిష్కరించేలా ఏర్పాట్లు కూడా చేపట్టబోతున్నారు. గతంలో ద్వితీయ స్థాయి నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ప్రజా సమస్యలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే స్థానిక శాసనసభ్యుని దృష్టికి తీసుకెళ్లాలి. ఆయన ద్వారా వచ్చిన ప్రతిపాదనలకే ఆమోదం తెలిపేవారు. ఇటువంటి పరిస్థితుల్లో సెకండ్ క్యాడర్ నాయకులంతా వారి ప్రాంతాలకే పరిమితం కావాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు పార్టీ మారితే గతంలో వారందించిన సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని కొంత మంది ఎమ్మెల్యే వెంటే వెళ్తూ సొంత పార్టీకి దూరం కావాల్సి వస్తోంది. కనీసం వారిని ఆపే ప్రయత్నం చేద్దామన్నా జిల్లాస్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ వారితో నేరుగా సంబంధాలు కలిగిన నేతలు అతి తక్కువ మంది మాత్రమే ఉంటున్నారు. ఇటువంటి పరిస్తితుల్లో సెకండ్ క్యాడర్‌ను మరింత బలోపేతం చేయాలంటే అధిష్టానం వారికి మరింత ప్రాధాన్యతను ఇవ్వడమే ఏకైక మార్గం. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ద్వితీయ స్థాయి నాయకులకు మరింత ప్రాధాన్యతను పెంచాలని యోచిస్తున్నారు.
జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు నేరుగా సమావేశం :
ఇప్పటివరకూ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి జల్లా పర్యటనకు వెళ్లే సందర్భంలో మంత్రులు, శాససభ్యులు జిల్లాస్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు మాత్రమే కలిసే అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో సెకడర్ కేడర్ నాయకులు సీఎంతో కనీసం ఫోటో తీసుకోవాలన్నా ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఆదిశగా ప్రోటోకాల్ లిస్టులో సెకండ్ కేడర్ నాయకుల పేర్లు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది ద్వితీయ స్థాయిలోని ముఖ్య నాయకులు సైతం సీఎం జగన్‌ను నేరుగా కలవలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా పర్యటనలకు వెళ్లే సందర్భంలో ఆయా జిల్లాలోని నియోజకవర్గానికి పది మందికి తక్కువ లేకుండా ద్వితీయ స్థాయి నాయకులతో నేరుగా సమావేశం కావాలని యోచిస్తున్నారు. ఆదిశగానే ఆయా జిల్లాల్లో పర్యటించే సందర్భంలో సెకండ్ కేడర్ నాయకులతో సమావేశం కావడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేపట్టే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
నెల్లూరు ఘటనతో సెకండ్ కేడర్‌కు పెరిగిన ప్రాధాన్యత :
వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో వరుసగా ఇప్పటికే ఇద్దరు శాసనసభ్యులు ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగారు. వారిద్దరూ త్వరలో పార్టీ కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, వెంకటగిరి శాసనసభ్యులు, మాజీ మంత్రి ఆనం రామయనారాయణ రెడ్డి, నెల్లూరు గ్రామీణం శాసనభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెన్నంట సెకండ్ కేడర్ నాయకులు పుష్కలంగా ఉన్నారు. వారిలో కొంత మంది ఇప్పటికే వైసీపీలో ఉండాలని నిర్ణయం తీసుకోగా, మరికొంత మంది ఎమ్మెల్యేల వెంటే నడవాలని యోచిస్తూ ఆదిశగానే తమ నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. అయితే, శ్రీధర్ రెడ్డి వెన్నంట 26 మంది కార్పొరేటర్లలో కొంత మందితో పార్టీ పెద్దలు సమావేశమై వైసీపీలోనే కొనసాగాలని విజ్ఞప్తిచేశారు. వారిలో కొంతమంది అందుకు అంగీకారం తెలపగా మరికొంత మంది మీకు మేము ఇప్పుడు కనిపించామా..కనీసం మా పేర్లైనా మీకు తెలుసా.. అంటూ ఎమ్మెల్యేలకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. ఈక్రమంలోనే ద్వితీయస్థాయి నాయకులతో పార్టీ పెద్దలు నేరుగా సంబంధాలను కొనసాగించలేకపోయారన్న వాస్తవ పరిస్థితి బయటపడింది. భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే సెకండ్ కేడర్ నాయకులతో నేరుగా సంబంధలను కొనసాగించడంతోపాటు సందర్భం వచ్చినప్పుడల్లా వారితో సమావేశం కావడం, పార్టీలో వారికి మరింత ప్రాధాన్యతను పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.