ఆంధ్రప్రభ స్మార్ట్ న్యూస్ – కడప బ్యూరో : నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరిన వైయస్ జగన్ మొదట ఇడుపులపాయ వైయస్సార్ ఘాట్ చేరుకుని తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన సమాధిపై పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్‌లోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో వైయస్ జగన్, కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు. హెలికాప్టర్ లో ఇడుపులపాయకు చేరుకోన్న జగన్ కు ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, వైసీపీ నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ప్రార్థనల అనంతరం వైయస్ జగన్ జిల్లా వైసీపీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. సమావేశం అనంతరం ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్ళి రాత్రికి అక్కడ నివాసంలో బసచేస్తారు.
కాగా, వైఎస్ జగన్ 25న ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతరం జగన్ పులివెందుల చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 26న పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వైఎస్ జగన్ ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. ఇక, 27న ఉదయం 9గంటలకు జగన్ పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న వివాహానికి హాజరవుతారు. అనంతరం బయలుదేరి బెంగళూరు వెళతారు.