కొవ్వూరు: వచ్చే ఎన్నికల్లో తనను ఎదుర్కొనేందుకు తోడేళ్లన్నీ ఏకమౌతున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వంతో మంచి జరిగిందని భావిస్తే అండగా నిలవాలని ఏపీ సీఎం జగన్ ప్రజలను కోరారు. అన్నగా, మేనమామగా, సోదరుడిగా, అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలను నాలుగేళ్లగా అమలు చేస్తున్న తనను ఎదుర్కొలేక విపక్షాలన్నీ ఒక్కటై తనపైకి వస్తున్నాయన్నారు.. వచ్చే ఎన్నికలు పేదలకు ,పెట్టుబడిదారులకని అంటూ పేదలపక్షపాతి అయినా తమ పార్టీ 175కి 175 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో బుధవారంనాడు విద్యా దీవెన పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.ఇప్పటివరకు 26,98,728 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేసింది. ఈ సందర్భంగా కొవ్వూరులో నిర్వహించిన సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు.
తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికి దశ దిశను చూపిస్తుందని సీఎం జగన్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యమని సీఎం జగన్ చెప్పారు. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు. తమ నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా వైఎస్ జగన్ గుర్తు చేశారు. వివక్ష,పేదరికం పోవాలన్నా చదువే గొప్ప అస్త్రమని సీఎం జగన్ చెప్పారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేదలు సామాజికంగా ఎదగాల్సిన అవసరం ఉందని జగన్ చెప్పారు
పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మారుస్తున్నామన్నారు. విద్యార్థుల చదవులపై చేస్తున్న ఖర్చు హ్యుమన్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ గా సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. విద్యార్ధుల్లో స్కిల్ డెవలప్ మెంట్ కోసం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. విద్యార్ధులకు ఉపాధి లభ్యమయ్యే లా ఉన్నత విద్యలో కరిక్యులమ్ మార్చామన్నారు. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్ కోర్సును ప్రవేశ పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతిభ చూపించే ప్రతి విద్యార్ధికి తమ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. చంద్రబాబు సర్కార్ దోచుకో పంచుకో తినుకో అనే విధంగా వ్యవహరించిందన్నారు. చంద్రబాబు సర్కార్ గజదొంగల ముఠాగా ఏర్పడిందని ఆయన ఆరోపించారు. విద్యార్ధులకు ఫీజలు చంద్రబాబు ఎగవేస్తే వాటిని సైతం తామే ఇచ్చామని చెప్పారు.