Saturday, November 23, 2024

ఉత్త‌రాంధ్ర‌లో ఇక‌ స్వ‌ర్గ‌యుగం… రాబోయే రోజుల‌లో ఐటికి ముఖ‌ద్వారం – జ‌గ‌న్

భోగాపురం – 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో భోగాపురంలో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన జగన్ ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఉత్తరాంధ్రలో వచ్చి స్థిరపడేలా అభివృద్ధి జరగబోతోందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు మూడేళ్లలో పూర్తై విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంద‌న్నారు. ఇవాళ ఇక్కడ పునాది రాయి వేశామ‌ని, .. మళ్లీ 2026లో మళ్లీ ఇక్కడికే వచ్చి ఇదే ప్రాజెక్టును ప్రారంభించబోతున్నామ‌ని తెలిపారు. ప్రజల దీవెనులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఎవరూ ఏం చేయలేరన్నారు. భోగాపురంపై టీడీపీ హయాంలోనే ప్రక్రియ పూర్తై ఉంటే పనులు ఎందుకు సాగలేదని ప్రశ్నించారు జగన్. కోర్టుల్లో కేసులను పరిష్కరించుకుంటూ వచ్చామన్నారు. భూసేకరణ పూర్తి చేశామన్నారు. అన్ని అనుమతులు తీసుకొచ్చామని తెలిపారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఇవన్నీ కాకుండానే ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు మాత్రమే టెంకాయ కొట్టి వెళ్లిపోయారని చంద్రబాబును ఎద్దేవా చేశారు. మళ్లీ ఏ మాత్రం సిగ్గులేకుండా గతంలోనే శంకుస్థాపన చేశామని చెప్పుకోవడం దారుణమైన రాజకీయాలు ప్రపంచంలోనే ఎక్కడా ఉండబోవన్నారు.

ఈ ప్రాజెక్టుల వల్ల లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు జగన్. 24 నెలల నుంచి 30 నెలల్లోపే పూర్తి అవుతుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విమానాశ్రయానికి అనుమతులు మంజూరు చేసిన ప్రధానికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించామన్నారు. 80 కోట్లతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మాణాలు చేపట్టామన్నారు. ఇవన్నీ నాలుగేళ్లలో పూర్తి చేసినట్టు తెలిపారు.
అల్లూరి జన్మించిన పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను గుర్తు చేసుకోవాలని ప్రజలను కోరారు. ఆయన పేరుతో ఓ జిల్లా ఏర్పాటు చేశామన్నారు. ఆరు జిల్లాలుగా చేసి కలెక్టర్లను నియమించామన్నారు. ఉత్తారంధ్రలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను నిర్మించామన్నారు. త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. దశాబ్దాలుగా ఈ సమస్య ఉన్నా ఏ ఒక్కరూ చిత్తశుద్ధి చూపలేదన్నారు. ఆ సమస్య లేకుండా చేయాలని… ఇచ్చాపురం, పలాసకు హిరమండలం నుంచి తాగునీరు సరఫరా చేయబోతున్నామన్నారు. 700 కోట్ల రూపాయలతో చేపట్టే పైప్‌ లైన్ ప్రాజెక్టును ఈ జూన్‌లో శ్రీకాకుళం ప్రజలకు అంకితం చేస్తామన్నారు. అలాగే అదాని డేటా సెంట‌ర్ ఏర్పాటుతో విశాఖ ఐటి కి ముఖ‌ద్వారంగా మార‌నుంద‌న్నారు.. ఇక తాను సెప్టెంబ‌ర్ నుంచి విశాఖ‌లోనే కాపురం పెడ‌తాన‌ని తేల్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement