రాజా నగరం : రాష్ట్ర పరదాల మహారాణిని కాలేజీ విద్యార్థులు బస్సు యాత్రలో ఏదో అన్నారని కోపం వచ్చింది. విద్యార్థులతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఈ మహారాణిని ఇంటికి పంపడానికి ప్రజలు ఎప్పుడో సిద్ధమై ఉన్నార’ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాన్ అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు పవన్ కల్యాన్ హాజరయ్యారు. ఈ సభలో రాజమండ్రి లోక్ సభ స్థానం బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… కాకినాడ ఆదిత్య కాలేజీ విద్యార్థులు పరదాల మహారాణిని ఇబ్బంది పెట్టారంట అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రాన్ని ఏలే మహారాణి కొంచెం జాగ్రత్తగా ఉండాలి… విద్యార్థులు కక్ష పెంచేసుకుంటారు… ఆ మహారాణి వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైంది… కొత్త తరానికి భవిష్యత్ ఇచ్చేందుకు దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తోంది అని పవన్ పేర్కొన్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా… ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలుసుకుని, ఆ మేరకు పొత్తు కుదుర్చుకుని సీట్ల సర్దుబాటు చేసుకున్నాం. పొత్తు ఎందుకంటే… మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని భరించలేం. వైసీపీ పాలన ఇంకొక్కసారి వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఒకప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బ్లేడు బ్యాచ్ గురించి విన్నాను. సరైన పాలకుడ్ని ఎన్నుకోకపోవడం వల్ల ఆ హింసాత్మకమైన సంస్కృతి ఇవాళ పచ్చని తూర్పు గోదావరి జిల్లాలోకి కూడా వచ్చేసింది. దీనికి ఒకటే మందు… ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం… వైసీపీ గూండాల తాట తీయడమే దీనికి మందు.
జగన్ ఈ మధ్య నన్ను ఎక్కువ తిట్టేస్తున్నాడు… పాపం! నన్ను తిడుతుంటే నాకు చాలా కోపం వచ్చేస్తుందని జగన్ అనుకుంటున్నాడు. నన్ను ఏమి తిట్టినా నాకు కోపం రాదు. కానీ ప్రజల మీద ఒక్క ఈగ వాలితే నాకు ఆపాదమస్తకం కోపం వస్తుంది. మీరు బూతులు తిట్టినా నాకు కోపం రాదు కానీ, ఒక దళిత డ్రైవర్ ను అకారణంగా, అన్యాయంగా చంపి డోర్ డెలివరీ చేయగానే నాకు వచ్చిన కోపం అంతా ఇంతా కాదు” అంటూ పవన్ ధ్వజమెత్తారు.
జగన్‌ది శాడిస్టిక్ మనస్తత్వం!
కలుగులో ఎలుక లాంటివాడు జగన్.. ఎవరికి పేరు వచ్చినా తట్టుకోలేని స్వభావం. చిత్ర పరిశ్రమను సైతం రాజకీయాల్లోకి లాగాలని చూశారని పవన్ అన్నారు. లక్షలాది మంది అభిమానులు ఉన్న సినిమా హీరోలంటే జగన్‌కు కుళ్లు అని .. అందరు సినీ హీరోల అభిమానులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పవన్ అన్నారు. సినిమా టికెట్ల ధరల విషయమై సీఎం జగన్‌తో మాట్లాడేందుకు చిరంజీవి, ప్రభాస్, మహేశ్ వెళితే వారిని అగౌరవపర్చారని ఆరోపించారు.
ప్రైవేటు మీటింగ్ జరుగుతుంటే.. శాడిస్టిక్‌గా సీక్రెట్ కెమెరాలు, మైక్‌లు పెట్టారని విమర్శించారు. చిరంజీవి అందరి తరఫున మాట్లాడితే.. ఆ వీడియోలను బయటకు రిలీజ్ చేసి అగౌరవపరిచారని ధ్వజమెత్తారు. అభిమాన హీరోలను సైతం గేటు దగ్గర నుంచి నడిపించారు. కనీసం భోజనం కూడా పెట్టకుండా కించపరిచి ఆనందం పొందిన వ్యక్తి జగన్ “లక్షలాది మంది అభిమానులు గుండెల్లో పెట్టుకునే హీరోలంటే జగన్‌కు కుళ్లు, ముఖ్యంగా ప్రభాస్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ అభిమానులు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి” అని పవన్ అన్నారు
‘ఉదయం లేస్తే మనందరికీ నీతులు చెప్పే సీఎం జగన్ గత ఐదేళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు. 38 కేసులు ఎదుర్కొని 16 నెలలు చిప్పకూడు తిన్న వ్యక్తి. ప్రతి శుక్రవారం వాయిదా ఎలా ఎగ్గొట్టాలి అని వణుకుతూ ఉంటాడు. రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో జగన్ అవినీతి విషయంలో మళ్లీ జైలుకెళ్లడం ఖాయం. జగన్ ఎక్కడ కోరుకుంటే అక్కడ.. ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పి ప్రత్యేక జైలు ఏర్పాటు చేస్తాం. అవినీతి పరులను వదలమని రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించిన సభ సాక్షిగా చెప్పిన మోదీ గ్యారెంటీతో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం’ అన్నారు పవన్ కళ్యాణ్.