గులకరాయి డ్రామాను రక్తి కట్టించిన సిఎం జగన్ కు అంధ్రా అస్కార్ గా పిలిచే భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందేనంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్ వేశారు. మంగళగిరిలోని నీరుకొండలో నేడు జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గులకరాయితో తన ప్రాణం పోయేదంటూ బిల్డప్ ఇచ్చిన జగన్, బ్యాండేజీ తీసిన తర్వాత అక్కడ కనీసం గాయం గుర్తు కనిపించకపోవడం నిజంగా దేవుడి స్క్రిప్ట్ అంటూ ఎగతాళి చేశారు.
ఇది ఇలా ఉంటే రచ్చబండలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు లోకేష్ . ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తమకు సక్రమంగా కౌలు డబ్బులు ఇవ్వడం లేదని రైతులు లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. రాజధానిలో పేదలకు ఇచ్చే పింఛన్ డబ్బులు కూడా సకాలంలో రావడం లేదని వాపోయారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధానిలో పేదలకు ఇచ్చే రూ.5 వేల పింఛన్‌ను కొనసాగిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అసైన్డ్ రైతులకు ఇవ్వాల్సిన కౌలును వడ్డీతో చెల్లిస్తామన్నారు.