Friday, November 22, 2024

జగన్‌కు సమన్లు అందలేదు, కోర్టుకు తెలిపిన న్యాయవాది

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సోమవారం నాంపల్లి కోర్టుకు హాజరు కావాలని జారీ చేసిన సమన్లు ఆయనకు అందలేదని న్యాయవాదులు న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు ఈ నెల 31వ తేదీలోపు జగన్‌కు సమన్లు సర్వ్‌ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు గత గురువారం ఏపీ సీఎంకు సమన్లు జారీ చేసింది. 28న (సోమవారం) కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 2014 అసెంబ్లిd ఎన్నికల సమయంలో #హుజుర్‌నగర్‌లో అనుమతి లేకుండా రోడ్‌ షోను నిర్వహించి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న అభియోగంపై వైఎస్‌ జగన్‌, శ్రీకాంత్‌ రెడ్డి, నాగిరెడ్డిపై ఈసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే అభియోగాన్ని పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు సమన్లు జారీ చేసింది. కాగా ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యేక న్యాయస్థానం సీఎంగా ఉన్న నేతకు సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి. ఈ కేసులో రెండవ నిందితుడిగా ఉన్న నాగిరెడ్డి కరోనాతో మరణించినట్లు పీపీ న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. నాగిరెడ్డి మరణ ధృవీకరణ పత్రం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మూడవ ముద్దాయిగా ఉన్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఆయనకు రూ. 5 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 31 వ తేదీకి వాయిదా వేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement