కడప – ప్రభ న్యూస్ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్నారు. పులివెందుల సిఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ఇడుపులపాయ ఎస్టేట్ నుండి హెలికాప్టర్ ద్వారా పులివెందుల బాకరపురం హెలిప్యాడ్, అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా పులివెందుల టౌన్ సిఎస్ఐ చర్చి ప్రాంగణానికి సీఎం చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రార్థనలకు హాజరైన వారిని సీఎం ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించారు.
కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇక్కడికి విచ్చేసిన బందువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలతోపాటు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది ఈ క్రిస్మస్ పర్వదినం రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బందుగణం, స్నేహితులతో.. కలిసి పండుగ వేడుకలో పాల్గొనడం తన మనసుకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తినిచ్చిందని సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే.. మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలేలు తనకు ఎల్లవేళలా అందాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి ప్రార్థించారు. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తరిస్తున్నానని.. ఎప్పటికీ మీ హృదయాల్లో ప్రియమైన నాయకుడిగా సుస్థిర స్థానాన్ని పొందగలనని ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ఆకాంక్షించారు.
కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసిన ముఖ్యమంత్రి.. 2024 చర్చి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ క్రిస్మస్ వేడుకలో ముఖ్యమంత్రి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతీ, ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే డా.డి. సుధా, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పలువురు జిల్లాస్థాయి అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు..