Wednesday, November 20, 2024

Big Story: జ‌గ‌న్‌, చిరు భేటీ మ‌త‌ల‌బేంటి.. టికెట్ల కోస‌మా, టికెట్ వ్యూహ‌మా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు మాట‌ల తూటాల‌తో చ‌లికాలంలోనూ హీట్ పుట్టిస్తుంటాయి. అయితే వైసీపీ అధినేత జ‌గ‌న్ పాలిట్రిక్స్ మాత్రం చాలా మందికి అస్స‌లు అర్థం కావు. తాను ఏ స్టెప్ వేస్తాడు.. ఎప్పుడు ఎట్లాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు అన్న‌ది చాలా సీక్రెట్ గా ఉంటుంది. అది త‌న అనుచ‌రులుగా పేరుగాంచిన వారికి కూడా అంతుచిక్క‌ని విధంగా ఉంటుంది స్ట్రాట‌జీ.. ఇక నిన్న ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని సినీరంగ ముద్దుబిడ్డ‌, మెగాస్టార్‌, వ్యాపార‌, రాజ‌కీయ‌వేత్త అయిన కొణిదెల చిరంజీవి క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. అదంతా సినిమా వ్య‌వ‌హారంగా టాక్స్ వ‌చ్చాయి. కానీ, చిరును జ‌గ‌న్ మీట్ కావ‌డానికి అస‌లు కార‌ణం వేరే ఉంద‌న్న‌ది అంత‌రంగికుల నుంచి వినిపిస్తున్న టాక్‌… అదేంటంటే…

రాజ‌కీయ నాయ‌కులు స‌ర్వ‌సాధారణంగా పొలిటిక‌ల్ కోణంలోనే అడుగులు వేస్తారు. ప్ర‌త్యేకంగా మెగాస్టార్ చిరంజీవిని ఏపీ సీఎం జ‌గ‌న్ ఆహ్వానించాడు అంటేనే అది పాలిటిక్స్ విష‌యంలోనే వారిద్ద‌రి భేటీ జ‌రిగింద‌న‌డంలో సందేహం లేదు. అందులోనూ ఈ భేటీకి 24 గంట‌ల ముందు చిరంజీవి పెట్టిన పార్టీ గురించి చంద్ర‌బాబు ప్ర‌స్తావించాడు. ఆ రోజున ప్ర‌జారాజ్యం లేకుంటే 2009లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చేద‌ని చెప్పుకొచ్చాడు. అప్పుడు..ఇప్పుడు చిరంజీవి సాన్నిహిత్యంగా ఉంటాడ‌ని చంద్ర‌బాబు ఎందుకు చెప్పాడో…ఇప్పుడు అనుమానం రాక‌మాన‌దు. అయితే ఇక్క‌డే ఉందో ట్విస్టు..

న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు ఎప్పుడైనా రాజీనామా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. అత‌నిపై అన‌ర్హ‌త వేటు వేయించ‌డానికి వైసీపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. దీంతో రాజీనామా చేసి బై ఎల‌క్ష‌న్‌కి వెళ్లాల‌ని ర‌ఘురామ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సంక్రాంతి సంద‌ర్భంగా ఢిల్లీ నుంచి భీమవ‌రం వ‌స్తాన‌ని తెలిపాడు ఆయ‌న‌. ఆ సంద‌ర్భంగా ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌కుండా భీమ‌వ‌రం రావడానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఆయ‌న్ను ఆహ్వానిస్తూ ప‌వ‌న్, త్రిబుల్ ఆర్ ల‌తో కూడిన హోర్డింగ్ లు భీమ‌రంలో వెలిశాయి. వాటిని చూసిన వాళ్లు జ‌నసేన‌లోకి ర‌ఘురామ వెళ్తున్నాడా అని చ‌ర్చించుకుంటున్నారు.

ఒక వేళ ఏపీలో ఉప ఎన్నిక‌ వ‌స్తే, టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ , కాంగ్రెస్‌, క‌మ్యూనిస్ట్ ల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ర‌ఘురామ‌ బ‌రిలోకి దిగుతాడు అనే టాక్ వినిపిస్తోంది. పార్టీల‌కు అతీతంగా అమ‌రావ‌తి ఎజెండాపై ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఆయ‌న స‌మాలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ మేర‌కు వ్యూహాత్మ‌క స్కెచ్ ఆయా పార్టీల‌తో క‌లిసి ఇప్ప‌టికే వేసిన‌ట్టు స‌మాచారం. దీంతో వైసీపీని ఈజీగా ఓడించొచ్చు అనే వాద‌న కూడా ఉంది. అందుకే, జ‌గ‌న్ కూడా అప్ర‌మ‌త్తం అయ్యార‌ని పొలిటిక‌ల్ అన‌లిస్టులు అంటున్నారు. ఆ క్ర‌మంలోనే చిరంజీవికి ప్ర‌త్యేకంగా జ‌గ‌న్ పండుగ రోజు ఆహ్వానం పంపార‌ని తాడేప‌ల్లి ప్యాలెస్ టాక్‌. ఇప్ప‌టి వ‌ర‌కు 3సార్లు ఏపీ సీఎం జ‌గ‌న్ ను చిరంజీవి క‌లిశారు. తొలిసారి సినీ పెద్ద‌లంద‌రితో క‌లిసి భేటీ అయ్యారు. మ‌లి విడ‌త ఫ్యామిలీతో వెళ్లి క‌లిశారు. ఆ సంద‌ర్భంగా రాజ‌కీయ‌ప‌ర‌మైన చ‌ర్చ వాళ్లిద్ద‌రి మ‌ధ్యా వ‌చ్చిన‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. త్వ‌ర‌లోనే వైసీపీలోకి చిరు చేర‌తార‌న్న‌ టాక్ కూడా అప్ప‌ట్లో వినిపించింది. కాగా, ఇప్పుడు మ‌ళ్లీ చిరంజీవిని సింగిల్ గా ఆహ్వానించడం వెనుక జ‌గ‌న్ రాజ‌కీయ కోణం ఉంద‌ని అనుమానం క‌లుగుతోంది. న‌ర్సాపురం లోక్ స‌భ‌ ఎన్నిక‌లు అనివార్యం అయితే చిరంజీవిని బ‌రిలోకి దించే ఆలోచ‌న వైసీపీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా అపోలో ఆస్ప‌త్రి యాజ‌మాన్యానికి, వైఎస్ ఫ్యామిలీకి చాలా ద‌గ్గ‌ర సంబంధాలు ఉన్నాయి. హీరో రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసన మెగా ఫ్యామిలీ మెంబ‌ర్‌. ఆ కోణం నుంచి వైఎస్ కుటుంబానికి, చిరంజీవి ఫ్యామిలీకి కూడా రిలేష‌న్ ఉంది. పైగా లంచ్ మీట్ త‌రువాత చిరంజీవి స్పంద‌న గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్ కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తేశాడు. జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి భోజ‌నం వ‌డ్డించ‌డాన్ని చిరు ప్ర‌త్యేకంగా చెప్పాడు. జ‌గ‌న్ దంప‌తుల అప్యాయ‌త‌, అభిమానానికి మురిసిపోయాడు. మ‌ళ్లీ క‌లుద్దామ‌ని జ‌గ‌న్ చెప్ప‌డం సంతృప్తిక‌రంగా ఉంద‌ని చిరంజీవి వెల్ల‌డించాడు. టిక్కెట్ల ధ‌ర‌ల‌పై రెండు మూడు వారాల్లో ఏదో ఒక రిపోర్ట్ వ‌స్తుంద‌ని ముక్తాయించాడు.

- Advertisement -

కాగా చిరు మాట‌ల్లోని ఆంత‌ర్యం.. ఇటీవ‌ల రాజ‌కీయ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే త్వ‌ర‌లోనే వైసీపీ కండువా క‌ప్పుకునే చాన్స్ ఉంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. అదే జ‌రిగితే, న‌ర్సాపురం ఉప ఎన్నిక బ‌రిలోకి వైసీపీ త‌ర‌పున చిరంజీవిని జ‌గ‌న్ దింపుతార‌న‌డంలో ఎలాంటి సందేహం ఉండ‌దంటున్నారు. చిరంజీవి, జ‌గ‌న్ మ‌ధ్య జరిగిన భేటీలో రాజ‌కీయ అంశాలు రాకుండా ఎందుకు ఉంటాయ‌ని పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఓ వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ తెలిపారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా భేటీ కేవ‌లం సినిమా టిక్క‌ట్ల‌పై మాత్రం జ‌రిగింద‌ని మ‌రో వైసీపీ నేత చెబుతున్నారు. ఏదేమైనా న‌ర్సాపురం ఎంపీ అభ్య‌ర్థిగా వైసీపీ నుంచి చిరంజీవి బ‌రిలో దిగడం కేవ‌లం ఊహాగాన‌మేనంటూ మ‌రో కీల‌క నేత కొట్టిపారేశారు. ఇట్లా భిన్న స్వ‌రాల న‌డుము చివ‌రాఖ‌రికి రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చ‌నే టాక్ కూడా వినిపిస్తోంది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement