మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసు ఎదుటి విశాల రోడ్లో జన సంచారంపై ఆంక్షలను ఎత్తేశారు. ఆ రోడ్డుపై వెళ్లేందుకు సాధారణ ప్రజానీకానికి నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు ప్రజలకు విశాల రహదారి అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో రోడ్లు గుంతలమయమైనా పట్టించుకోని అప్పటి ప్రభుత్వం మాజీ సీఎం జగన్తన ఇంటి ముందు మాత్రం జిగేల్ మనేలా రోడ్డు వేశారని ప్రజలు అయిదేళ్లు మండిపడ్డారు. ఈ రహదారి నిర్మాణం కోసం తాడేపల్లిలో అప్పటివరకు లాండ్ మార్క్‌గా వున్న భారత మాత విగ్రహాన్ని సైతం ఆ సర్కార్ తొలగించింది. విగ్రహం తొలగింపుపై అప్పట్లో స్థానికులు ఆందోళనలు కూడా చేపట్టారు. అలాగే ఈ రోడ్డు నిర్మాణం కోసం అప్పట్లో కరకట్ట వెంబడి ఉన్న వందలాది పేదల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చేశారు.
పేదోళ్ల ఇళ్లు కూల్చి మరీ …
ఈ రోడ్డు నిర్మాణంలో పేదల ఇళ్లను కూల్చేశారు. అంతే కాదు, ఇళ్లు, స్థలాలు కోల్పోయిన పేదలకు పరిహారం చెల్లింపులోనూ పక్షపాతం చూపించారని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. వలంటీర్‌గా పని చేస్తున్న శివ శ్రీ అనే మహిళ.. తన ఇల్లు కూల్చొద్దంటూ తిరుగుబాటు చేసింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను తన సమస్యను విన్నవించుకుంది. దీంతో ఆమెపై జగన్ సర్కార్ కక్షకట్టి, వలంటీర్ విధుల నుంచి తొలగించింది. దీనికితోడు రాత్రికి రాత్రే ఆమె ఇంటిని జేసీబీలతో కూల్చేశారు. ఇలా వందలాది మంది పేదల ఇళ్లను తొలగించి కోట్లు ఖర్చుపెట్టి రోడ్డు నిర్మించిన ఈ రోడ్డుకు ఇరువైపులా లాండ్ స్కేపింగ్, డిజైనర్ లైటింగ్ ఏర్పాటు చేయించారు. ఇన్నాళ్లూ సీఎం ఇల్లు భద్రత పేరుతో మూసిన రోడ్డును.. తెరవడంతో తాడేపల్లి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరే… ఎప్పుడైతే జనం రాకపోకలు పెరిగాయో? మాజీ సీఎం ఇంటి ఎదుట ప్రైవేటు సైన్యం ప్రత్యక్షమైంది. 30 మంది సెక్యూరిటీ గార్డులు ఇప్పుడు పహారా కాస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ ఆధీనంలో పోలీసులు కాపలా కాస్తే.. ఇప్పుడు ప్రైవేటు సెక్కూరిటీని రంగంలోకి దించటం విశేషం.