కోడికత్తి కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఏ కోర్టుకు హాజరయ్యారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై దాడికేసులో విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా ఎన్ఐఏ కోర్టుకు సీఎం జగన్ పీఏ కేఎన్ఆర్ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ ఈనెల 13కు ఎన్ఐఏ కోర్టు వాయిదా వేసింది.
కోర్టుకు రాలేను.. ట్రాఫిక్ ఇబ్బందులొస్తాయి: జగన్ పిటిషన్
కాగా, కోడి కత్తి కేసుకు సంబంధించి ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కోర్టుకు హాజరుకావాలని గత వాయిదాలో మెజిస్ట్రేట్ పేర్కొన్న నేపథ్యంలో జగన్ పిటిషన్ వేశారు. ‘‘రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. పేదలకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాల సమీక్షలు ఉన్నాయి. కోర్టుకు సీఎం హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేయించాలి’’ అని పిటిషన్‌లో జగన్ అభ్యర్థించారు.