Tuesday, November 26, 2024

AP: మూడు రోజులైంది… ఇంకా నోరుమెద‌ప‌రేం… సీఎస్ ను ప్ర‌శ్నించిన మూర్తి యాదవ్

విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో : వేల కోట్ల రూపాయల విలువ చేసే దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములు బలవంతపు రిజిస్ర్టేషన్ల విషయంలో ఏపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలు చేసి 72 గంటలైంద‌ని, ఇప్పటికీ ఆయన నుంచి సరైన సమాధానం లేదని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. మంగళవారం ద్వారకానగర్ పౌర గ్రంధాలయం విశాఖలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… బీసీ, ఎస్సీ, ఎస్టీల‌ను భయపెట్టి జవహర్ రెడ్డి అండ్ కో అసైన్డ్ భూములు దోచుకున్నారని, చక చకా రిజిస్ర్టేషన్లు చేసేసుకొన్నారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో వేలకోట్ల రూపాయల అతి భారీ భూ కుంభకోణమ‌న్నారు. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ స్పూర్తికి, ఆశయాలకు విరుద్ధంగా ఐఏఎస్ ల నేతృత్వంలో జరిగిన కుంభకోణమిదన్నారు. దళితులకు ప్రభుత్వ భూములు ఇవ్వాల్సిన జవహార్ రెడ్డి లాంటి ఐఏఎస్ లు అంతకుముందు ప్రభుత్వాలు కేటాయించిన భూములను తన బినామీల పేరిట రాయించుకోవడం దారుణమని, దళితుల పొట్ట కొట్టడమే అని ధ్వజమెత్తారు.

జవహార్ రెడ్డి ముఠా ముందే భూములు రాయించుకున్నారని ఆ పనులన్నీ పూర్తయ్యాక ప్రధాన కార్యదర్శిగా వున్న జవహార్ రెడ్డి తన పలుకుబడితో ఆ తర్వాత జీఓ 596 రిలీజ్ చేశారని చెప్పారు. గండిగుండంలో సర్వే నంబర్ 271/6 కాలకొండ భరత్ సుభాష్ రిజిస్ట్రేషన్ చేయుంచుకున్నారని, ముకుందపురం నుంచి మెహెర్ చైతన్య వర్మ రుద్రరాజు, సుభాష్ పేరుపై అనేక రిజిస్ట్రేషన్ లు జరిగాయని డాక్యుమెంట్లను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఆనందపురం మండలంలోని భూమి భోగాపురంలో కూడా రిజిస్ట్రేషన్ లు జరిగాయని, రాజ్ కుమార్ అగర్వాల్ పెరుపైనా అనేక రిజిస్ట్రేషన్ లు జరిగాయని చెప్పారు. సుభాష్ అనే వ్యక్తి ఎవరు? మెహెర్ చైతన్య వర్మ రుద్రరాజు,రాజ్ కుమార్ అగర్వాల్ లు ఎవరు అని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే అసైన్డ్ భూముల స్కాంకు ఈ రాష్ర్టంలోనే సంబంధంలేని సూర్రెడ్డి త్రిలోక్ సూత్రదారి అని మూర్తి యాదవ్ ఆరోపించారు.

ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల వివరాలు బహిర్గంతం కాకుండా ఈసి లు, సర్టిఫైడ్ కాపీలు రాకుండా రెవిన్యూ వెబ్ సైట్ ని జవహార్ రెడ్డి బ్లాక్ చేయించారని మూర్తి యాదవ్ ఆరోపించారు. కుంభకోణం బయటపెట్టిన మూర్తి యాదవ్ ని ఎలా జైలుకు పంపాలో జవహార్ రెడ్డ సమీక్ష జరిపారని ఆరోపించారు. నిజానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష జరపాల్సింది దళితలకు జరిగిన అన్యాయం గురించి, జీ వోను అడ్డం పెట్టుకొని దళితుల పొట్టగొట్టిన తీరు గురించి అని అన్నారు. ఇప్పటికైనా తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే తాను విశాఖ సీపీ దగ్గరికి వెళ్లి లొంగిపోతానని మూర్తి యాదవ్ సవాల్ విసిరారు. మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పి వి స్ న్ రాజు, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయ కర్త నాగలక్ష్మి చౌదరి పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement