న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సీపీఎస్ రద్దు చేస్తానన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పడం దుర్మార్గమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం వ్యాఖ్యానించింది. గురువారం ఢిల్లీలో ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌తో పాటు ఏపీయూటిఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్ ప్రసాద్, తెలంగాణ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సీపీఎస్ రద్దు చేయాలని పోరాడుతున్న ఉపాధ్యాయులపై బైండోవర్ కేసులు, నిర్బంధాలు అప్రజాస్వామికమని అన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అంటూ తానిచ్చిన హామీలు బైబిల్, ఖురాన్ భగవద్గీత అన్న జగన్ టీచర్లపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని బి. వెంకట్ అన్నారు. ప్రభుత్వ విద్యా రంగమే సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆధారమని, విద్యా రంగం లేకపోతే సమాజ అభివృద్ధి ఉండదని అన్నారు. విద్యారంగాన్ని కార్పొరేటీకరణ చేయడమంటే శాస్త్ర, సాంకేతికాభివృద్ధికి సంకెళ్ళు వేయడేమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం తిరోగమన విధానాలకు తోడ్పడేదేనని విమర్శించారు. గ్రామీణ పేదలకు, ప్రత్యేకించి దళితులు, బలహీన వర్గాలకు సాధనమైన ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత అన్నారు. ఏపీలో జరుగుతున్న సీపీఎస్ రద్దు ఉద్యమానికి వ్యవసాయ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.
తెలంగాణలో ‘మా ఊరు మా బడి’ కార్యక్రమం మంచిదేనని, కానీ ఉపాధ్యాయులు లేకుండా ‘మా బడి’ని ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో సామాజిక అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలపరచాలని వెంకట్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష విధానం సరైంది కాదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావాలని కోరారు. కేంద్ర విధానాలపై పోరాడాలని ఎస్టీఎఫ్ఐ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మే 21,22వతేదీలో అఖిల భారత మహాసభలు విజయవాడలో జరుగుతాయని ఆయన ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..