Saturday, November 23, 2024

హోదా సాధనకు సమయమిదే.. రాష్ట్రపతి ఎన్నికకు ముందే సాధించాలి : కనకమేడల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి ఎన్నికలకు ముందే ప్రత్యేక హోదా సాధించాలని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ ఆకాంక్షించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్ మాట మీద నిలబడాలని డిమాండ్ చేసిన కనకమేడల, మీ వెంట మేముంటామని భరోసా ఇచ్చారు. హోదా సాధనకై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. జగన్ మద్దతు లేకుండా రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు జరగదన్న ఎంపీ విజయసాయిరెడ్డి మాటలను ఉదహరించిన కనకమేడల, కేంద్రం మెడలు వంచే అవకాశం వైసీపీకి వచ్చిందని వ్యాఖ్యానించారు. వెనకడుగు వేయకుండా, మడమ తిప్పకుండా జగన్ సర్కార్ చిత్తశుద్దితో ముందుకు వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన వైసీపీ ఓట్లను ప్రత్యేక హోదా సాధన కోసం ఉపయోగించుకోవాలని సూచించారు.

ప్రధానమంత్రిని 15 సార్లు కలిసిన జగన్ పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, బకాయిలపై విజ్ఞప్తి చేశారని కనకమేడల గుర్తు చేశారు. జగన్ ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చారో అందరికీ తెలుసునన్నారు. అన్ని పార్టీలు కలిసి ఏపీని మోసం చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 25 మంది ఎంపీలను వైసీపీకి ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్ అన్నారని కనకమేడల గుర్తు చేశారు. విపక్షాలు,అధికార పక్షాలు రాష్ట్రపతిగా తమ అభ్యర్థిగా గెలిపించుకోవాలని చూస్తున్నాయని, ఈ సమయంలో జగన్ విభజన హామీల సంగతి గుర్తు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్ర సమస్యలపై పోరాటంలో రాజీలేని పోరాటం చేస్తూ తమ పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందని చెప్పుకొచ్చారు. సీబీఐ, ఈడీ కేసుల నుంచి బయటకు వచ్చేందుకు జగన్ కేంద్రానికి తల వంచుతున్నారని ప్రజలు భావిస్తున్న తరుణంలో ఇప్పుడైనా జగన్ తన సత్తా చూపిస్తారా అని కనకమేడల రవీంద్రకుమార్ సవాల్ విసిరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement